రేపు సుప్రీం కోర్ట్‌లో తేలనున్న కర్ణాటకలో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల భవిష్యత్తు..!

సుప్రీంకోర్టు కర్ణాటకలో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల భవిష్యత్తును రేపు తేల్చనుంది. స్పీకర్ తీసుకున్న అనర్హత నిర్ణయంపై తీర్పు వచ్చేంత వరకు ఉప ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని పరిశీలించాలని ఈసి కి ధర్మాసనం సూచించింది. స్పీకర్ తమపై చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారన్న కారణంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించి మొత్తం పదిహేడు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు అప్పటి స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్.

అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోయారు. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పదిహేడు మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టు పరిశీలనలో ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక లోని పదిహేను స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. దీంతో వెంటనే సుప్రీం కోర్టు తలుపు తట్టారు అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలు. కర్ణాటక ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమను అనుమతించాలని సుప్రీం కోర్టును కోరారు. అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.

ఇరవై ఐదు న దీనిపై విచారణ చేపడతామని, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. పిటిషన్లపై నిర్ణయం వెలువడే వరకు ఉప ఎన్నికలను సస్పెండ్ చేయాలన్న విజ్ఞప్తిని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ ను నోటిఫై చేసిన తర్వాత కోర్టు జోక్యం చేసుకోవడం సరి కాదని వాదించారు ఈసీ తరఫు న్యాయవాది. రాజీనామా లేఖలను ఆమోదించకుండా అనర్హత వేటు వేశారని, అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది వాదించారు. సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే తమ కుటుంబ సభ్యులకు లేదా తాము సూచించిన వారికి బిజెపి ఉప ఎన్నిక టిక్కెట్లు కేటాయిస్తుందన్న ఆశతో ఉన్నారు అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu