రాహుల్‌కి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు... డిగ్గీ

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ ఇక తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అన్నారు. మరి సోనియా గాంధీ తప్పుకున్న తర్వాత ఆ సీటు మీద పార్టీలో ఎవరైనా సీనియర్ని కూర్చోబెట్టాలి అన్నా, లేకపోతే స్వయంగా తానే కూర్చుంటానని అన్నా దిగ్విజయ్ సింగ్ మీద గౌరవం పెరిగేది. కానీ సోనియా పదవి నుంచి తప్పుకుని రాహుల్ గాంధీకి ఆ పదవి ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏ రాయి అయితేనేం కాంగ్రెస్ పార్టీ పళ్ళు రాలగొట్టడానికి అనేది ఆయన మరచిపోయారు. ఓవైపు తల్లిని తప్పుకోమంటూ మరోవైపు కొడుకుకు పట్టం కట్టమంటూ తెలివితేటలు ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ దిగ్విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. పార్టీని పునరుత్తేజితం చేయాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని దిగ్విజయ్ అన్నారు. రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఇంకా సమయం రాలేదన్న కాలేదన్న వాదనలను ఆయన ఖండించారు. జవహర్ లాల్ నెహ్రూ 38 ఏళ్ల వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారని, మౌలానా ఆజాద్ అయితే 35 ఏళ్లకే పదవి చేపట్టారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి ఇంతకు మించి మంచి తరుణం రాబోదని దిగ్విజయ్ అన్నారు. మొత్తమ్మీద సోనియా గాంధీ పార్టీ పదవి నుంచి తప్పుకునే ఉద్దేశంతోనే ఇలా ముందుగా దిగ్విజయ్ చేత ‘హింట్’ ఇప్పించి వుంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.