జగన్ ఫొటో చిరిగిపోయింది.. పట్టాదారు పాసుపుస్తకాలు జగన్ కొంప ముంచేస్తాయా?

చంద్రబాబు  చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. 

అయితే తాజాగా ఆయన పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలేంటంటూ ఫైర్ అయ్యారు. వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో విషయంలో మాత్రం ఆయన పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ భూములను వాళ్ల తాత, తండ్రి ఇచ్చారా? అంటూ నిలదీశారు. మన పెద్దలు మనకు వారసత్వంగాఇచ్చిన పుస్తకాలపై సైకో జగన్ ఫొటోలను సమర్ధిస్తారా అంటూ జగన్ పై చంద్రనిప్పులు చెరిగారు. అంతే కాదు ఆ పట్టాదారు పాసుపుస్తకాలను చించి పారేశారు. 

కాకినాడలో ఎన్నికల సభలో ఆయన ఆగ్రహం అంబరాన్ని తాకింది. చంద్రబాబు ఆగ్రహం ధర్మాగ్రహమేనంటూ సభికులు చప్పట్లతో మద్దతు పలికారు.   అసలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఆ అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా జనంలోకి తీసుకువెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆయనకు తోడుగా కూటమి భాగస్వామ్యపక్షాలు కూడా ల్యాండ్ టైలిటింగ్ యాక్ట్ దుర్మార్గమైనదన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరిగేలా ప్రచారంలో ఆ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే పులివెందులలో వైఎస్ జగన్ సతీమణి భారతిని ఓ వైసీపీ నేతే మా పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకంటూ నిలదీశారు. ఆ ప్రశ్నకు సమాధానం లేక భారతి నేల చూపులు చూశారు. సరిగ్గా ఆ అంశాన్నే చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. తొలి నుంచీ కూడా పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తూనే ఉంది.

ఇప్పుడు ఎన్నికల సమయంలో అదే ప్రధాన అంశంగా తెరమీదకు తీసుకురావడంతో జనంలో కూడా ఇదే విషయమై చర్చ జరుగుతున్నది. మొదట భూమిపట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో, ఇప్పుడేమో  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ చట్టం. ఈ రెంటినీ కలిపి చూస్తే మన భూములు మనవి కాకుండా జగన్ చేస్తున్నారంటూ జనంలో పెద్ద చర్చ ఆరంభమైంది. ఆ విషయాన్నే చంద్రబాబు మరింత స్పష్టంగా ప్రజల గుండెలను నేరుగా తాకేలా లేవనెత్తారు.  జగన్ తీసుకువచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చంద్రబాబు భాష్యం చెప్పారు.  ఈ చట్టం అమలులోకి వస్తే పట్టాదారుపాసు పుస్తకం ఉండదు. పత్రాలుండవు. మన ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి కావాలి. ఇది మీకు సమ్మతమేనా అని ప్రజజలను నేరుగా ప్రశ్నించారు.  ఎంతో మంది సీఎంలుగా పనిచేశారు. ఎవరైనా ఇలాంటి పనికిమాలిన చట్టం తెచ్చారా? ఏ సీఎం అయినా పట్టాదారు పుస్తకాలపై తన ఫొటో వేసుకున్నారా? అని నిలదీశారు.  ఈ ఫొటోల పిచ్చోడిని సాగనంపకపోతే మీ భూములన్నీ కబ్జా చేసేస్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.  ఇక జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను చంద్రబాబునాడయుడు చింపేసి, గాల్లో ఎగురవేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.  మాకు పొలాలిచ్చింది మీ తాత రాజారెడ్డీ కాదు, మీ నాయన వైఎస్సూ కాదు..  అంటూ నెటిజన్లు జగన్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. పొద్దున్నే మీ ముఖం చూడాల్సిన ఖర్మ మాకేంటి సామీ అంటూ ఈసడించుకుంటున్నారు.  

అసలు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో అన్న థీమ్ ను అమలు చేయడం మొదలైనప్పటి నుంచే జగన్ పై సామాజిక మాధ్యమంలో సెటైర్లే మరో రేంజ్ లో పేలాయి. అదేదో సినిమాలో చెప్పినట్లు... ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అంటూ జగన్ ను నెటిజన్లు ట్రోల్ చేశారు.    ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జ‌గ‌న్ బొమ్మలతో రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు భారీ ఫోటో ఎగ్జిబిష‌న్  ఏమైనా పెట్టాయా అంటూ అప్పట్లోనే సందేహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో జగన్ ఫొటోల పిచ్చి ఆయన మెడకు చుట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో భూమి ఉన్న ఏ ఒక్కరూ జగన్ ఫొటోను చూడడానికి ఇష్టపడిని విధంగా పరిస్థితి తయారైంది. అదే ఆయనకు ఈ ఎన్నికలలో భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టే అంశంగా మారిపోయిందని అంటున్నారు.