"షీ" టీమ్‌ కానిస్టేబుల్‌‌నే వెంటాడిన ఆకతాయి

బహిరంగ ప్రదేశాలు..సెల్‌ఫోన్స్...సోషల్ మీడియా ద్వారా మహిళలలను వేధింపులకు గురిచేస్తున్న ఆకతాయిల పని పట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన షీ టీమ్స్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. దీంతో పోకిరీల బెడద కాస్తంత తగ్గిందని రికార్డులు చెబుతున్నాయి. అయితే ఎంతోమంది ఆడపిల్లలను వేధింపుల నుంచి రక్షించిన షీ టీమ్‌లోని ఓ కానిస్టేబులే ఆకతాయిల బారిన పడితే..రాచకొండ సమీప ప్రాంతానికి చెందిన ఓ యువకుడు డిగ్రీ చదువుతున్న ఓ యువతి సెల్‌ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపేవాడు..

 

కొద్దిరోజులు ఓపిగ్గా భరించినప్పటికీ అతడి వేధింపులు తారాస్థాయికి చేరడంతో సదరు యువతి షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. విచారణలో భాగంగా షీ టీమ్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఒకరు నిందితుడికి ఫోన్ చేశాగా..ఆ కేటుగాడు ఆమెనే వేధించడం మొదలుపెట్టాడు. టార్చర్ ఎక్కువ కావడంతో ఆ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..అతనిపై నిర్భయ చట్టం నమోదు చేసినా..పోలీసులకు చిక్కకుండా వేధింపులను అలాగే కొనసాగించాడు.

 

అక్కడితో ఆగకుండా ఆమె నెంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్స్‌లో నమోదు చేయడంతో..ఆమె వేధన వర్ణనాతీతం..పలువురు ఫోన్ చేసి మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ఆగంతకుడిని పట్టుకున్నారు. నిందితుడిని వరంగల్ జిల్లాకు చెందిన నిఖిల్‌గా గుర్తించారు. సెల్‌ఫోన్‌ నెంబర్‌కు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో ఇతన్ని పట్టుకోవడానికి కాస్తంత శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.