మహారాష్ట్రలో మధ్యంతర రాజకీయం...

 

రాజకీయాల్లో ముదిరిపోయిన మరాఠా యోధుడు శరద్ పవర్ మహారాష్ట్ర రాజకీయాలలో తన శైలి ‘పాలిటిక్స్’ని చూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మహారాష్ట్రలోని ఫడ్నవిస్ బీజేపీ ప్రభుత్వానికి అడక్కుండానే మద్దతు ఇస్తానని ప్రకటించిన ఆయన పరోక్షంగా బీజేపీ, శివసేన సంబంధాలు మరింత దెబ్బతినడానికి కారణమయ్యారు. ఫడ్నవిస్ బల పరీక్షలో నెగ్గిన అనంతరం పవార్ తన పవర్ చూపించడం ప్రారంభించారు. రెండు రోజుల క్రితం పవార్ మాట్లాడుతూ, తన ఎన్సీపీ ఫడ్నవిస్ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ఇవ్వదని, అంశాలవారీగా మద్దతు ఇస్తుందని చెప్పారు. ఒక విధంగా పవార్ చేసిన ఆ వ్యాఖ్యలు భవిష్యత్తులో ఆయన ఫడ్నవిస్ ప్రభుత్వం కంట్లో నలుసులా మారే ప్రమాదం వుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయగఢ జిల్లాలోని అలీబాగ్‌లో జరిగిన ఎన్సీపి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవార్ మహారాష్ట్రలో  బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని, మహారాష్ట్రలో ఏ క్షణంలో అయినా మధ్యంతర ఎన్నికలు రావొచ్చని అందువల్ల ఎన్సీపీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా వుండాలని ఆయన పిలుపు ఇచ్చారు. శరద్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించాయి.