ఆశ్రమంలో శవాలు
posted on Nov 19, 2014 2:13PM

హర్యానాలోని బర్వాలా పట్టణంలో వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్‌ని అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు ఆయన భక్తులు పోలీసుల మీద దాడి చేయడం, పోలీసులు అక్కడ పరిస్థితిని అదుపులోకి తేవడానికి బాష్పవాయు గోళాలు ప్రయోగించడం గురించి తెలిసిందే. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్లోక్ ఆశ్రమ స్వామీజీ రామ్పాల్పై హర్యానా పంజాబ్ ఉమ్మడి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆశ్రమానికి వెళ్ళారు. పరిస్థితిని అదుపు చేసిన తర్వాత ఆశ్రమంలోకి వెళ్ళిన పోలీసులకు రామ్‌పాల్ స్వామీజీ కనిపించలేదుగానీ, ఆశ్రమం లోపల నాలుగు మృతదేహాలు మాత్రం కనిపించాయి. ఈ విషయాన్ని హర్యానా రాష్ట్ర డీజీపీ ఎస్.ఎన్. వశిష్ట బుధవారం వెల్లడించారు. ఆశ్రమంలో అనారోగ్యంతో ఉన్న మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతో మరణించారని తెలిపారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారితోపాటు 70 ఏళ్ల వృద్ధురాలు కూడా వుంది. ఇప్పుడు మరణించిన వారు పోలీసుల బాష్పవాయువుల కారణంగా మరణించారా లేక మరో కారణంగా మరణించారా అనేది తేలాల్సి వుంది.