శశికళపై ఆరోపణలు నిజమే.. ఆమెకు వీఐపీ ట్రీట్ మెంట్..
posted on Jul 24, 2017 3:06PM
.jpg)
అక్రమాస్తుల కేసులో శశికళ బెంగుళూరులోని పరప్పన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శశికళకు జైలు శిక్ష విధించగానే తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించిన సంగతి కూడా విదితమే. కానీ కోర్టు మాత్రం వాటికి ఒప్పుకోకుండా.. సాధారణ ఖైదీలాగే ఉండాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన వార్తలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. మాజీ డీఐజీ రూప ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అగ్రహార జైల్లో ఉండాల్సిన శశికళ, వాస్తవానికి అక్కడ ఉండటం లేదని, జైలుకు సమీపంలో ఉన్న ఓ లగ్జరీ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్నట్టు తనకు సమాచారం ఉందని రూప సంచలన విషయాన్ని బయటపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ హోమ్ మంత్రి ఆర్.అశోక్ అధ్యక్షుడిగా ఉన్న పీఏసీ, 15 రోజుల్లోగా రూప చేసిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించగా, తాజాగా వారు స్వయంగా హాజరై రిపోర్టును ఇచ్చారు. ఆమె జైలు జీవితాన్ని గడుపుతుండగా, ప్రత్యేక ఆహారం, వంటగాళ్లు, ప్రత్యేక కిచెన్, ఐదు గదులు, ప్రత్యేక దుస్తులు తదితర ఎన్నో సౌకర్యాలు కల్పించారని..శశికళకు వీఐపీ ట్రీట్ మెంట్ నిజమేనని, ఈ విషయంలో డీఐజీ రూప నివేదికలో కొన్ని వాస్తవాలు ఉన్నాయని వెల్లడించారు.