సారిక పోస్ట్ మార్టం రిపోర్టులో దిగ్బ్రాంతికర విషయాలు

 

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికయిన ఎస్. రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనం అయ్యారు. పోస్ట్ మార్టం నివేదికలో తీవ్ర దిగ్బ్రాంతి కలిగించే కొన్ని విషయాలను ఫోరెన్శిక్ నిపుణుడు నాగ మోహన్ బయటపెట్టారు.

 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సారిక శవానికి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆమె పక్కటెముకలు విరిగి ఉన్నట్లు గుర్తించాము. అలాగే ఆమె ఇద్దరు కుమారులు అభినవ్ మరియు శ్రీయన్ కాళ్ళ ఎముకలు కూడా విరిగి ఉన్నట్లు గుర్తించాము. వారి ముగ్గురి ఛాతిలో పొగ పేరుకొనిపోయుంది. గదిలో అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏర్పడిన పొగను వారు పీల్చినందున అది వారి ఛాతిలో అలాగే ఉండిపోయింది. ఇంకా మరికొన్ని అంశాలను నిశితంగా పరీక్షించవలసి ఉంది,’ అని అన్నారు.

 

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ పీల్చి ఉండటం చాలా సహజమే కానీ సారిక పక్కటెముకలు, పిల్లల కాళ్ళు విరిగిపోయి ఉండటం చాలా అసహజంగా ఉంది. వారు అగ్నిప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు గదిలో నుండి బయటకు వచ్చి మేడ మీద నుండి దూకలేదు. అదే గదిలో సజీవ దహనం అయిపోయారు. అంటే వారిని చనిపోయే ముందు ఎవరో చాలా దారుణంగా బలమయిన వస్తువుతో కొట్టి ఉండాలి. లేకుంటే ఎముకలు విరిగిపోయే అవకాశం లేదు. వారి పట్ల అంత దారుణంగా ఎవరు వ్యవహరించినా క్షమార్హులు కారు. ఒక అభాగ్యురాలయిన మహిళను, అభం శుభం తెలియని ముద్దులొలికే ఆ ముగ్గురు చిన్నారులను అంత దారుణంగా ఎవరయినా హత్య చేసి ఉండి ఉంటె వాళ్ళు ఐసిస్ ఉగ్రవాదుల కంటే కిరాతకులు..క్రూరులని చెప్పవచ్చును.