ఒకే ఒక్క మాట చోటా రాజన్ ను పట్టించిందా?

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ఇండోనేషియాలోని పోలీసులకు చిక్కడం.. అక్కడి నుండి ఇండియాకి తీసుకురావడం.. 5 రోజుల కస్టడీ విధించడం అందరికి తెలిసిందే. అయితే దేశ దేశాలని గడ గడలాడించిన డాన్ అంత తేలికగా పోలీసులకు ఎలా చిక్కాడా అని అందరి సందేహం. అయితే ఈ ప్రశ్నకు ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. చోటా రాజన్ కావాలనే లొంగి పోయాడని.. తన ఆరోగ్యం బాలేని నేపథ్యంలో తనే పోలీసులకు చిక్కాడని అంటున్నారు. కానీ చోటా రాజన్ ఎలా పట్టుబడ్డాడో పోలీసులు చెబుతున్న కథనం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకే ఒక్క మాట చోటారాజన్ ను కటకటాలపాలు చేసింది. ఆ ఒక్క మాట ఏంటనుకుంటున్నారా?

చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ నిఖల్జే. కానీ ఆ పేరు ఉపయోగించింది చాలా తక్కువ. సందర్భాన్ని బట్టి తన పేరును మార్చేస్తుంటాడు చోటారాజన్. అయితే అక్టోబర్ 25 న ఇండోనేషియా నుండి ఆస్ట్రేలియా వెళ్లడానికి రెడీ అయిన నేపథ్యంలో అక్కడ బాలి విమానాశ్రయానికి చేరుకున్న చోటారాజన్ ఏం ఆలోచిస్తున్నాడో ఏమో కానీ తన అసలు పేరు చెప్పేశాడు. అయితే పాస్ పోర్టులో ఉన్న పేరు మాత్రం మోహన్ కూమార్. అంతే అక్కడ ఉన్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి.. ప్రశ్నలు మీద ప్రశ్నలు అడగగా అసలు సంగతేంటో బయటపడింది. మొత్తానికి చోటారాజన్ నోటి నుండి వచ్చిన ఒకే ఒక్క మాట ఆయన తలరాతనే మార్చేసింది.