మరో వివాదంలో చింతమనేని ప్రభాకర్

 

ఇదివరకు ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై చెయ్యి చేసుకొన్నందుకు విమర్శలు మూటగట్టుకొని, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు కల్పించిన దెందులూరు తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్ళీ మరో వివాదం సృష్టించారు. కొల్లేరులో నిషేధిత ప్రాంతమైన ఆటపాక - కోమటిలంక మధ్య నిన్న రాత్రి మట్టి రోడ్డు నిర్మించారు. ఈసారి ఆయన చేతిలో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ ఈశ్వరరావు అవమానం పొందవలసి వచ్చింది.

 

కొల్లేరు సరస్సుకి చాలా దూర దేశాల నుండి రకరకాల పక్షులు వలస వస్తుంటాయి. కనుక అక్కడ ఎటువంటి నిర్మాణ పనులు జరుపకూడదని సుప్రీంకోర్టు స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చింది. పైగా ఆ ప్రాంతమంతా అటవీశాఖ అధీనంలో ఉంది. అయినా చింతమనేని లెక్కచేయకుండా రాత్రికి రాత్రే మట్టి రోడ్డు నిర్మించారు. సుమారు 500లారీల మట్టిని తెచ్చి రోడ్డు నిర్మించారు. కోమటి లంకలో తన అనుచరుల పేరిట ఉన్న తన బినామీ చేపల చెరువులలో చేపలకు ఆహారం వగైరా తరలించదానికి వీలుగా రోడ్డు నిర్మించినట్లు సమాచారం. చింతమనేనిని అడ్డుకోలేకపోయిన అటవీశాఖ అధికారులు కైకలూరు పోలీసులకు పిర్యాదు చేయగా సెక్షన్స్ 353, 447 క్రింద ఆయనపై, అనుచరులపై కేసు నమోదు చేసారు.