మోదీపై పోటీ చేస్తున్న మాజీ జవాన్ నామినేషన్ తిరస్కరణ

 

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ ను ఈసీ తిరస్కరించింది. నామినేషన్ పత్రాలలో సరైన సమాచారాన్ని పొందుపరచని కారణంగా.. అతని నామినేషన్ ను తిరస్కరించారు. విధుల నుంచి డిస్మిస్ చేసినట్టు ఆధారాలను ఇవ్వలేకపోయారనే కారణాన్ని చూపించారు.

జవాన్లకు నాసిరంకం ఆహారాన్ని పెడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలను చేసిన తేజ్ బహదూర్ ను 2017లో విధుల నుంచి తొలగించారు. ఈ అంశానికి సంబంధించి అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో  ఈసీ ఆయన నామినేషన్ ను తిరస్కరించింది. సరైన డాక్యుమెంట్లను అందించడంలో విఫలమయ్యారని తెలిపింది.

ఈ సందర్భంగా తేజ్ బహదూర్ మాట్లాడుతూ.. ఆధారాలను ఇవ్వాలని నిన్న సాయంత్రం 6.15 గంటలకు తనను అడిగారని.. అన్ని డాక్యుమెంట్లను సమర్పించినప్పటికీ నామినేషన్ ను తిరస్కరించారని మండిపడ్డారు. ఈ విషయమై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తేజ్ బహదూర్ చెప్పారు.