సీఎస్ కు అప్పుడు నేను గుర్తుకురాలేదా?

 

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు అధికారాలు లేవని సీఎస్ సుబ్రమణ్యం చెప్పడాన్ని ప్రస్తావించారు. అధికారాలు లేవని సీఎస్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ విషయమై  తాను వివరణ కోరానని చంద్రబాబు చెప్పారు. దీనిపై కమ్యూనికేషన్ కొనసాగుతోందన్నారు.

టీటీడీకి చెందిన బంగారం విషయంలో కూడా సీఎస్ సుబ్రమణ్యం ఓవర్‌యాక్షన్ చేసారని చంద్రబాబు మండిపడ్డారు. టీటీడీ వివాదంలో రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. టీటీడీ వివాదంలో సీఎస్ సుబ్రహ్మణ్యం తనకు చెప్పకుండా కమిటీ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు.. అధికారులే సొంతంగా కమిటీలు ఎలా వేస్తారని నిలదీశారు. సీఎస్ కమిటీ వేసి రాటిఫికేషన్ కోసం తనకు పంపుతారా అంటూ విరుచుకుపడ్డారు. కమిటీ వేసేటప్పుడు మాత్రం గుర్తుకురానిది.. రాటిఫికేషన్ చెయ్యడానికి మాత్రం గుర్తుకు వచ్చానా అని ప్రశ్నించారు. రాటిఫికేషన్ చేయడానికే తాను ఉన్నానా? అంటూ మండిపడ్డారు. టీటీడీ విషయంలో తప్పు చేయని ఈవోను సీఎస్ ఎలా తప్పు పడతారంటూ చంద్రబాబు నిలదీశారు.

ఈ విషయమై ప్రజల్లో గందరగోళపర్చేందుకు విపక్ష పార్టీలు కూడ ప్రయత్నించాయని బాబు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లుగా తప్పులు లేకుండా పనిచేసిన అధికారులకు తాను అండగా నిలిచామని అన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందుకే రాష్ట్రం అన్ని విషయాల్లో నెంబర్‌వన్‌గా నిలిచిందని చంద్రబాబు అన్నారు.