కారులో కయ్యం

 

 

 

కారు ఎక్కాలన్న సరదా అందరికీ ఉన్నా, అందులో పట్టేది కొందరే. సరిగ్గా ఇదే అంశంపై టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. కరీంనగర్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలతో పాటు 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అన్ని చోట్లా టికెట్లను ఆశిస్తున్నవారు పెరిగిపోతుండడంతో గొడవలు ముదురుతున్నాయి. పార్టీలో కొత్తగా చేరేవాళ్లకు టికెట్లు ఇస్తే ఊరుకొనేది లేదని.. సామూహికంగా రాజీనావూలు చేస్తామని మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి హెచ్చరించారు. దీంతో టీఆర్‌ఎస్ టికెట్ల పోరు బజారుకెక్కింది. మంథని నుంచి రాంరెడ్డి, ఆయన తనయుడు సునీల్‌రెడ్డి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. తమకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్న రాంరెడ్డి కుటుంబానికి, అదేస్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పుట్ట మధు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడం ఇబ్బందిగా మారింది. కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలతో మధు చర్చలు జరపడం, పార్టీ కూడా ఆయనకు టిక్కెటు ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రాంరెడ్డి అసంతృప్తితో ఉన్నారు.


రామగుండంలోనూ అదే పరిస్థితి. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ పార్టీ టికెట్ కోసం పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో కోరుకంటి చందర్ టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయగా, పొత్తును ఉల్లంఘించి సోమారపు సత్యనారాయణ టీడీపీ నుంచి నామినేషన్ వేయడానికి రావడం, సకాలంలో బీ-ఫారం రాక స్వతంత్రుడిగా బరిలోకి దిగి విజయం సాధించడం తెలిసిందే. ఈసారి ఇరువురు ఒకే పార్టీలో ఉన్నా సమాంతరంగా గ్రూపులకు సారథ్యం వహిస్తున్నారు.

చొప్పదండి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి బొడిగె శోభ టికెట్ ఆశిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్‌ఎస్‌లోకి వస్తారని, లేదంటే టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ కు టికెట్ వస్తుందనే ప్రచారంతో శోభ పార్టీపై గుర్రుగా ఉన్నారు. జగిత్యాలలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.జితేందర్‌రావు, వి.రమణారావుల నడుమ టికెట్ కోసం పోరు కొనసాగుతోంది.  కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టికెట్ తనకే అనే ధీమాతో ఉండగా, టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ సైతం ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు.