రివర్స్ టెండర్లే కాదు రివర్స్ కేసులు కూడా.. వైసీపీ గేర్ మామూలుగా లేదుగా!

రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్టులను పడుకోపెట్టేసిన వైసీసీ ప్రభుత్వం.. ఇప్పుడు క్రిమినల్స్ ను ప్రోత్సహించడానికి రివర్స్ కేసుల కార్యక్రమం మొదలెట్టింది. ఇందులో భాగంగా నేరస్తులను వదిలేసి బాధితులపైనే కేసులు నమోదు చేయడం మొదలెట్టింది. నిజమే.. ఇసుక మాఫియా దాడికి గురైన ఆర్ఐపై పోలీసులు తాజాగా నమోదు చేసిన కేసును చూస్తే రాష్ట్రంలో రివర్స్ కేసుల దందా మొదలైందన్నవిపక్షాల విమర్శలు వాస్తవమనిపించక మానవు. 

ఇసుక మాఫియా దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆర్ఐ అరవింద్ గంటా లక్ష్మణరావు అనే వ్యక్తి తనపై దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చూడా చేశారు.

గుడివాడ మండలం మోటూరులో ఇటీవల అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన ఆర్ఐపై దాడి జరిగిన సంగతి విదితమే. జేసీబీతో పక్కకు నెట్టేయడమే కాకుండా గొంతు నులిమి హత్య చేయడానికి కూడా ఇసుక మాఫియా ప్రయత్నించింది.

అయితే దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి ఖైదు చేయాల్సిన పోలీసులు రివర్స్ లో దాడికి గురైన వారి మీదే కేసు నమోదు చేయడాన్ని విపక్ష తెలుగుదేశం సహా పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. 
ఆర్ఐ యే తమను లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారంటూ ఇసుక మాఫియా కేసులు పెట్టడంతో పోలీసులు ఆఘమేఘాలపై స్పందించి ఆర్ఐ అరవింద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇసుక మాఫియా ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా పని చేయడమే ఆ ఆర్ఐ తప్పిదమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  నిజాయితీ అధికారులను వేధింపులకు గురి చేసి తమ దారికి తెచ్చుకోవడం కోసమే ఇసుకమాఫియా తప్పుడు కేసులు పెడుతుంటే పోలీసులు వారికి వత్తాసు పలకడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే అధికారు లెవరూ తమ బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వర్తించగలిగే పరిస్థితి ఉండదన్న ఆందోళన వ్యక్తమౌతున్నది. 

 ఇప్పటికే తన అస్తవ్యస్త చర్యలతో పదే పదే కోర్టు చేత అక్షింతలు వేయించుకుంటున్న జగన్ సర్కార్ ఇప్పుడు ఆర్ఐపై కేసు విషయంలోనూ మొట్టికాయలు తినక తప్పదని విపక్ష తెలుగుదేశం విమర్శించింది.

ప్రలోభాలకు లొంగకుండా, అక్రమార్కులకు, అక్రమాలకు ఎదురొడ్డి నిజాయితీగా పని చేసే ఉద్యోగులపై ప్రభుత్వ వేధింపులు వైసీపీ సర్కార్ లో నిత్యకృత్యంగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిజాయితీగా పని చేసే అధికారులకు అన్ని వర్గాల వారూ అండగా, మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. 

ఇప్పటికే జగన్ సర్కార్ రివర్స్ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రశ్నార్ధకంగా మారిపోయింది. నిజాయితీ ఉద్యోగులపై వేధింపుల పర్వం ఇలాగే కొనసాగితే.. రాష్ట్రంలో పరిస్థితి మరింత అరాచకంగా తయారౌతుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu