బ్రెగ్జిట్ ఎఫెక్ట్..భారతీయులపై జాత్యాంహకార దాడులు

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంతో ఆ దేశపు వాసులు ఇతర దేశీయులపై దాడులకు పాల్పడుతున్నారు. బ్రెగ్జిట్‌‌పై రెఫరెండం జరిగిన తరువాతి రోజు నుంచి ఇప్పటి వరకు 100కు పైగా జాతి వివక్ష, వేధింపుల ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా సిరియా, ఇరాక్‌ల నుంచి వచ్చిన శరణార్థులను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ యువత రెచ్చిపోతున్నారు. పోలాండ్ వాసులు తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ కేంబ్రడ్జ్ యూనివర్శిటీ గోడలపై రాశారు. అంతటితో ఆగకుండా పోలీష్ వాసులు నివసిస్తున్న కాలనీపై దాడులకు దిగుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీష్ ఎంబసీ బ్రిటన్ ప్రధాని కార్యాలయానికి తన నిరసన తెలిపింది.

 

ఇదిలా ఉండగా బ్రెగ్జిట్ ఎఫెక్ట్ భారతీయులపై పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థిని నిఖిల్ పంధీ 24వ తేదిన, లిన్సన్ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు నిఖిల్ వద్దకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించారు. తాను ఇండియా నుంచి అని సమాధానం ఇవ్వగా..పాస్‌పోర్ట్‌ను..బ్రిటన్ జాతీయుడినని నిరూపించే బయోమెట్రిక్ ప్రూఫ్‌ను లాక్కొన్నారు. రెండేళ్ల నుంచి బ్రిటన్‌లో ఉంటున్న తనకు ఇలాంటి అనుభవం ఎప్పుడు ఎదురు కాలేదని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇతర దేశస్థులపై జరుగుతున్న జాత్యాంహకార దాడులపై బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్పందించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న యూనియన్ ప్రజలు, యూనియన్‌లో భాగమైన విదేశాల్లో ఉంటున్న బ్రిటీష్  జాతీయులందరూ ఒకటే. ఈ తరహా ఘటనలను తీవ్రంగా పరిగణిస్తానని..కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అటు అంతర్జాతీయ సమాజం కూడా తమ పౌరుల భద్రతను పర్యవేక్షించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.