పెద్దాయనపై సోనియా మనసు కరగదా..?

పాములాడించే దేశంగా ముద్రపడిన దేశాన్ని, ప్రగతి పథం వైపు నడిపించిన దార్శనికుడు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పూర్తికాలం నడిపించిన అపర చాణక్యుడు. ఆయనే తెలుగు బిడ్డ పీవీ నరసింహరావు. ఇవాళ ఆయన జయంతి..ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఆయనకు నివాళుర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీ బయటి పార్టీలకు చెందిన వ్యక్తులు. వారే పీవీపై అంతటి కృతజ్ఞత చూపుతుంటే..కాంగ్రెస్ పార్టీ ఇంకెంతగా చేయాలి. కానీ దేశవ్యాప్తంగా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ ఆ జాడ కనిపించలేదు. ఏ పార్టీ కోసమైతే ఆయన జీవితాన్ని అంకింత చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ కనీసం ఆయనను పట్టించుకోలేదు.

 

ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ శ్రేణులు పీవీని పట్టించుకున్న పాపాన పోలేదు. పీవీని కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విధానం, సీతారాం కేసరి తర్వాత సోనియా పగ్గాలు చేపట్టిన రీతి అన్నీ కాంగ్రెస్ మార్క్ రాజకీయమే. ఆనాడు పీవీకి జరిగిన అవమానాన్ని ఏ తెలుగుబిడ్డా మర్చిపోలేడు. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తుంటే కాంగ్రెస్ మొత్తం ఆయన పక్షాన నిలబడింది. చమురు కుంభకోణం, జేఎంఎం, సెయింట్ కిట్స్, లఖూభాయ్ పాఠక్, యూరియా కుంభకోణాల్లో పీవీ పాత్ర ఉందంటూ అప్పట్లో పెద్ద దుమారం రేగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ కనీసం సంఘీభావం ప్రకటించపోవడంతో పీవీ ఒంటరి వాడైయ్యారు. ఆఖరికి మరణానంతరం కూడా ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సోనియా అంగీకరించలేదు.

 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో హైదరాబాద్‌లో జరిగిన అంత్యక్రియలు తూతూ మంత్రంగా కానిచ్చేశారు. సగం కాలిన పీవీ భౌతిక కాయాన్ని ఊరకుక్కలు పీక్కుతినడం ఎంతోమందిని కలచివేసింది. పార్టీ కోసం త్యాగం చేసిన మనిషికి ఇదా సత్కారం అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి...దుమ్మె కదా అని కాంగ్రెస్ దులిపేసుకుంది. ఇయన చనిపోయి పుష్కరం కావొస్తున్నా అధినేత్రి కాస్త కూడా మెత్త బడలేదు. దానికి రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన వినయ్ సీతాపతి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమమే ఉదాహరణ. సోనియా విధేయుడైన మణిశంకర్ అయ్యర్ మళ్లీ పీవీ మీద విషం కక్కారు. కానీ ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా లోకం గుర్తించింది. ఆయన చేపట్టిన సంస్కరణల ఫలాలు ఇపుడు అందుతున్నాయి.