పన్నీర్ రనౌటేనా... థర్డ్ అంపైర్ మోదీ, రక్షిస్తాడా?

 

పన్నీర్ సెల్వం కథ కంచికేనా? జయమ్మ ముఖ్యమంత్రి అవ్వమనగానే మూడు సార్లు సీఎం అయ్యాడు. చిన్నమ్మ దిగిపోగానే బుద్ధిగా రాజీనామా చేశాడు. కాని, అంతలోనే ఎదురు తిరిగాడు. అమ్మ ఆత్మ సందేశం ఇచ్చిందంటూ శశికళ ముఖంలో కళ లేకుండా చేశాడు. ఆమె సీఎం ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ చేశాడు! కాని, ఇప్పుడు జైల్లో సాధారణ ఖైదీలా కఠిక నేల మీద కాలం గడుపుతోన్న చిన్నమ్మకి పెద్ద సినిమానే చూపిన పన్నీర్ తాను మాత్రం సాధించుకున్నది ఏం లేదు! పళని స్వామి క్యాబినేట్ లో బెర్త్ కాదు కదా... అసలు పార్టీలోనే చోటు లేకుండా పోయింది! ఇదంతా పన్నీర్ అమాయకత్వమా? లేక అత్యాశా? లేక ఇంకేదైనా దూర దృష్టా? పైపైన చూస్తే పన్నీర్ సెల్వం ప్రస్తుతానికి ఓడిపోయినట్టే. తనంత తానుగా రాజీనామా చేసి, శశికళను అడ్డుకుని, చివరకు పళని స్వామి ముందు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాని, 1969లో 18ఏళ్ల వయస్సు నుంచీ పన్నీర్ రాజకీయం చేస్తూనే వున్నాడు. పెరియార్ నుంచి జయ దాకా ఎంతో మంది తమిళ మహా మహా నేతల్ని చూశాడు. కరుణానిధి పార్టీలో పని చేసి ఎంజీఆర్ వెంట నడిచి క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చాడు. అదృష్టం కొద్దో, అర్హత వుండటం వల్లో మూడు సార్లు సీఎం అనిపించుకున్నాడు. ఇంత అనుభవం వున్న వాడు ఈసారి శశికళకి తెలిసి తెలిసి ఎందుకు ఎదురు తిరిగాడు? పన్నీర్ కి తన వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు రారు అని తెలియదా? తెలిసే వుండాలి. ఆయన పార్టీలో ఆయనకి ఎంత మద్దతు లభిస్తుందో ఆయనకి తెలియకుండా వుంటుందా? ఖచ్చితంగా ఒక అంచనా వుంటుంది. కాబట్టి తాను సీఎంగా కొనసాగుతానని ఆయన భ్రమపడి వుండకపోవచ్చు. మూడు సార్లు సీఎం పదవి ఏ గొడవా చేయకుండా వదిలేసిన ఆయన దాని కోసం మరీ కక్కుర్తిపడతాడని కూడా అనలేం!

 

పన్నీర్ సెల్వం వెనుక కేంద్రం, బీజేపి వున్నాయన్నది బహిరంగ రహస్యం. అందుకే, ఆయన చిన్నమ్మకి దారిచ్చి తప్పుకున్నవాడు అమాంతం అడ్డుపడ్డాడు. అయితే, ఎంతో రిస్క్ చేసి మన్నార్ గుడి మాఫియాకి శత్రువుగా మారిన పన్నీర్ మోదీ నుంచి పొందిన అభయం ఏమై వుంటుంది? ఢిల్లీ ప్రభుత్వం ఎవరి చేతిలో వుంటుందో వారి చేతిలో పవర్ కి కొదవ వుండదు. కాబట్టి పన్నీర్ భద్రత మోదీ సర్కార్ తీసుకుంటుంది. అలాగే, ఆయనతో వెంట వచ్చిన వారితో కలిసి కొత్త పార్టీ పెట్టవచ్చు. ఆ పార్టీ సాయంతో తమిళనాడులో కమలం వికసించాలని ప్రయత్నించవచ్చు. ఇది ఎవ్వరైనా అంగీకరించేదే. అలాగే, పన్నీర్ సెల్వమ్ కూడా తమిళనాడులో బీజేపికి చేసిన పాయానికి ప్రతిఫలంగా కేంద్రంలో ఏదైనా మేలు పొందవచ్చు!

 

పన్నీర్, బీజేపి కాంబినేషన్ లో ఇప్పటికైతే ఎక్కడా రజినీకాంత్ కనిపించటం లేదు కాని... ఆయన ఏ క్షణంలో అయినా తమిళనాడు పొలిటికల్ సీన్లో ఎంటర్ అవ్వచ్చు! పురుచ్చి తలైవీ నిష్క్రమణం తరువాత భారీ శూన్యం ఏరపడింది తమిళనాట. కలైంగర్ కూడా మంచం పట్టి మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాడు రజినీకాంత్ కి. ఆయన ఒకవేళ రాజకీయాల్లోకి రాదలుచుకుంటే ఇంతకంటే గొప్ప అవకాశం వుండదు. పై నుంచి మోదీ రక్షణలో , శశికళ జైల్లో వున్న వేళ, కరుణానిధి హాస్పిటల్ కే పరిమితమైనప్పుడు, జయ మరణంతో జనం అయోమయంలో వున్నప్పుడు ... సూపర్ స్టార్ కి సూపర్ ఛాన్సే! అది ఆయన వాడుకుంటాడా అన్నదే పెద్ద ప్రశ్న!

 

రజినీకాంత్ ని బీజేపి ఒకవేళ రాజకీయాల్లోకి తీసుకు రాగలిగితే పన్నీరుకి, ఆయన వర్గానికి అంతకంటే కావాల్సింది ఇంకేం వుండదు! రజినీకాంత్ కు దగ్గరైపోయి పన్నీర్ అత్యంత కీలకంగా మారవచ్చు! చక్రం తిప్పవచ్చు! అయితే, ఇదంతా ఇప్పటికైతే అద్భుతమైన ఊహే! నిజమయ్యే అవకాశాలు ఎంతగా వున్నాయో.. అంతకంటే ఎక్కువగా లేవు కూడా!

 

పన్నీర్ సెల్వం మూర్ఖంగా శశికళని ఢీకొట్టి రాజకీయ జీవితం పాడు చేసుకున్నాడని వాదించే వారు మాత్రం ఇంకా కొన్నాళ్లు ఆగి మాట్లాడితేనే బెటర్! ఎందుకంటే, పన్నీర్, పళని చెన్నైలో ఏం చేస్తారనే దాని కన్నా ... రాబోయే కాలంలో మోదీ, శశికళ ఢిల్లీ, బెంగుళూరుల్లోంచి ఏం చేస్తారనేదే కీలకం!