వలల బిజినెస్ మళ్ళీ పుంజుకోవచ్చు



తెలంగాణ రాష్ట్రంలో వలల బిజినెస్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో ఈ బిజినెస్ బాగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ బిజినెస్ దాదాపుగా జీరో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వలల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లే  ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా విద్యార్థులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి సంస్థల మీద రాళ్ళదాడులు చేశారు. దాంతో పలు సంస్థలు, భవనాలకు పెద్దపెద్ద వలలు కట్టుకున్నారు. ఆంధ్రావారి పరిశ్రమలకు చుట్టూ వలలు కట్టుకున్నారు. కొన్ని పరిశ్రమలు, సంస్థలవారయితే వలలు కట్టుకోవడంతోపాటు ‘‘మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు’’ అని బోర్డులు కూడా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో అయితే ఏ ఆంధ్రావారికి చెందిన ఏ బిల్డింగ్ మీద అయినా పైనుంచి కింద వరకు పెద్ద వల కట్టేసి వుండేది. ఏ బిల్డింగ్ ఆంధ్రావారిది, ఏ బిల్డింగ్ ఆంధ్రావారిది కాదు అని చెప్పడానికి ఈ వలలే పెద్ద కొండగుర్తుగా వుండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రావారు వలలు తొలగించి రిలాక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ వలల బెడద తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఉస్మానియా భూములను స్వాధీనం చేసుకుని, అక్కడ పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలగా వుండటం, దీన్ని వ్యతిరేకించిన ఉస్మానియా విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ జరిపించడం రాష్ట్రంలోని పరిస్థితిని మార్చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ స్థలాల్లో కట్టారంటూ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన ఒక హోటల్ మీద ఉస్మానియా విద్యార్థులు రాళ్ళదాడి చేశారు. అలాగే ఒక పెట్రోల్ బంక్ మీద కూడా తమ ప్రతాపం చూపించారు. భవిష్యత్తులో ఉస్మానియా విద్యార్థులు మరెంత రెచ్చిపోతారో, ఉస్మానియాలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా ఏయే వర్గాలకు విస్తరిస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్‌కి చెందిన నాయకులు, టీఆర్ఎస్ సానుభూతిపరులు తమ భవంతులకు రక్షణగా వలలు కట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో వలల బిజినెస్ ఊపందుకునే అవకాశం వుంది.