సీఎంల మధ్య సంధి కుదిరిందా?
posted on Jun 22, 2015 4:27PM

ఓటుకు నోటు కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి రెండు రాష్ట్రాల రాజకీయాలలో ఎప్పుడు ఏం జరగుతుందా అని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ కేసు మొదలైనప్పటినుండి ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గలేదు. ఇద్దరు సీఎంలు ఎప్పడూ ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నట్టే ఉండేవారు. అయితే గత రెండు మూడు రోజుల నుండి ఈ కేసులో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోకపోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీఎంల మధ్య సంధి కుదిరిందా? అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
దీనికి నిదర్శనంగా.. ఈకేసులో చంద్రబాబు వాయిస్ టెస్ట్ లకు నోటీసులు పంపిచాలని ఆలోచనలో ఉన్న ల్యాబ్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపించ వద్దని ఆదేశాలు జారీ చేయడం.. చంద్రబాబు స్థాయి మనిషికి వాయిస్ టెస్ట్ చేసినా, నోటీసులు జారీ చేసినా అది వివాదాస్పదమవుతుందని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పోలీసులు టీ న్యూస్ ఛానల్ కి, సాక్షి ఛానల్ కి నోటీసులు జారీ చేయగా చంద్రబాబు ఆవిషయంపై అధికారుల్ని పిలిచి మందలించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పనులు తొందరపాటుతో చేయకూడదని.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కూడా అధికారులకు సూచించారట.
అయితే పరిస్థితి కాస్త నెమ్మదించడానికి.. ఇద్దరు సీఎంలు కాస్త స్పీడ్ తగ్గించడానికి.. వారిలో ఇంత మార్పు రావడానికి వెనుక కారణం కేంద్రం జోక్యం చేసుకోవడమేనా అనే వార్తాలు వినిపిస్తున్నాయి. ఈ కేసు వ్యవహారంపై కేంద్రం ఇరు సీఎంలపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మరీ ఉద్రిక్తం కాకుండా రెండురాష్ట్రాల మధ్య ఉన్న రాజకీయ పోరును చల్లార్చేందుకు.. ఇద్దరు సీఎం మధ్య రాజీ కుదిర్చే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.