నేతలకు ఫోన్ ఫియర్.. "పలుకే బంగారమాయెనా" అన్న పరిస్థితి
posted on Jun 22, 2015 2:48PM

ఓటుకు నోటు కేసు పుణ్యమా అని ఇప్పుడు రాజకీయ నేతలు ఫోన్లలో మాట్లాడటానికే వణికిపోతున్నారు. అందులో టీఆర్ఎస్ నాయకులకు ఈ గుబులు మరీ పట్టుకుందట. మైకులిస్తే గంటలు గంటలు మాట్లాడే నేతలు ఇప్పుడు ఫోన్ లో మాట్లాడటానికే భయపడుతున్నట్టు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రేవంత్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో వాళ్లు ఉపయోగించిన టెక్నాలజీకి ఇప్పుడు వాళ్లే భయపడుతున్నారట. అంటే ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చిన్నగా తీసుకుంటుంది అనుకున్నారేమో.. కానీ ఏపీ సర్కార్ దానిని అంతటితో వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు తెరాస నేతలలో గుబులు పుట్టుకుందట. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కు ఏపీ నేతలకంటే.. తెలంగాణ నేతలే ఎక్కువ భయపడటం విశేషం. ఎక్కడ ఫోన్ మాట్లాడితే ఏం సమస్య వస్తుందా అని కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితికి వచ్చారట.. ఒకవేళ ఫోన్ ఎత్తినా కానీ ఏదో పొడిగాపొడిగా మాట్లాడటం... లేకపోతే తమ పీఏలతో ఫోన్లు ఎత్తించి "సార్ బిజీ గా ఉన్నారు" అని చెప్పించడం చేస్తున్నారట.
అసలు రాజకీయాలంటేనే డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఒక్క రాజకీయ నేత మాత్రమే కాదు ఓటేసే ఓటరు కూడా డబ్బు తీసుకోకుండా ఓటు వేయలేని పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. అలాంటిది రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అతిగా ప్రవర్తించి.. అసలు వారు ఎలాంటి తప్పు చేయరు అన్నట్టు దీనినో పెద్ద ఈష్యుగా చిత్రీకరించి పెద్ద రచ్చ చేశారు. చివరికి "ఎవరు తీసుకున్నగోతులో వాళ్లే పడతారు" అన్న సామెత ప్రకారం ఫోన్ ట్యాపింగ్ లు అంటూ కుట్రలు చేస్తే చివరికి ఏమయింది.. వారి ఫోన్లు వాళ్లే మాట్లాడుకోలేని పరిస్థితికి వచ్చారు.