ప్రతిపక్షాల కొంప ముంచిన అవిశ్వాసం

 

కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రెండు నెలల క్రితం శాసనసభలో కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల ఆయన ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏమి లేకపోగా, అది ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీలే తీవ్రంగా నష్టపోయాయి. చంద్రబాబు పరోక్ష సహకారంతో అవిశ్వాస గండం అవలీలగా గట్టెక్కిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇనుమడించిన ఉత్సాహంతో దూసుకుపోతుంటే, ఆ సందర్భంగా పార్టీ విప్ ను దిక్కరించిన కారణంగా ఏకంగా 15 మంది శాసన సభ్యులు అనర్హత వేటుకి బలయిపోయారు. తద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వం ఇప్పుడు శాసనసభలో మరింత బలం పుంజుకొన్నారు. శాసన సభ సమావేశాల ప్రారంభానికి రెండ్రోజుల ముందే స్పీకర్ వ్యూహాత్మకంగా శాసనసభ్యుల మీద అనర్హత వేటు వేయడంతో ఇప్పుడు సభలో 145 స్థానాలతో అధికార పార్టీ మరింత బలపడింది. అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం గురించి మరో మారు ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేవు. ఒకవేళ చేయదలచుకొన్నా కూడా సభా నియమాల ప్రకారం ఒకే దఫాలో సాగుతున్న శాసన సభ సమావేశాలలో వరుసగా మూడవసారి అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలులేదని రాజ్యంగా నిపుణులు చెపుతున్నారు.

 

ఈవిధంగా చూస్తే, తెరాస, వైకాపాలు అత్యుత్సాహానికి పోయి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల వైకాపాకే తీరని నష్టం కలిగింది. రాజకీయ అనుభవ రాహిత్యంతో ఆ పార్టీ అనాలోచితంగా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వలన పార్టీ విప్ప్ లు దిక్కరించి మరీ ఆ పార్టీకి విధేయత ప్రకటించినందుకు వారికి బహుమానంగా అనర్హత వేటు పది వారందరూ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మారారు. సాధారణ ఎన్నికలకి కేవలం పది నెలలే మిగిలి ఉన్నందున ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల కమిషనర్ హెచ్. ఎస్. బ్రహ్మ సూచన ప్రాయంగా ప్రకటించడంతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ అధిష్టానం అండతో పార్టీలో చెలరేగిన అసమ్మతిని అణచిపారేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేటి నుండి మొదలయ్యే శాసన సభా సమావేశాలలో మరింత చెలరేగిపోవడం ఖాయం.