మరోసారి తలెత్తిన… తరతరాల వివాదం… వందేమాతరం!

జనగణమన మన జాతీయ గీతం! మరి వందేమాతరం ఏంటి? ఈ అనుమానం అసలు చాలా వరకూ ఎవరికీ రాదు. కారణం… వందేమాతరం కూడా జనగణమనతో సమానమైన జాతీయ గేయమని అంతా అనుకుంటారు! మరి నిజం అదేనా? జాతీయ గీతం లాగే అందరూ, అంతటా వందేమాతరానికి కూడా గౌరవం ఇవ్వాలా? వందేమాతరం ఎవరైనా పాడకపోతే అది నేరమా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు కాదు… స్వాతంత్ర్యం రాక మునుపు నుంచే వున్నాయి. జనగణమన , వందేమాతరాల్లో దేన్ని జాతీయ గీతం చేయాలన్న చర్చ నుంచే రెండు పాటల మధ్యా పోటీ మొదలైంది. ఇక ముస్లిమ్ లలో కొందరు వందేమాతరం వ్యతిరేకించటంతో వివాదం మరింత రాజకీయంగా, నాటకీయంగా మారిపోయింది!

 

ఈ మధ్య జరిగిన ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలో పెద్ద రచ్చ ఒకటి చోటు చేసుకుంది. కారణం వందేమాతర గీతం ఆలపనే! సమావేశంలో పాల్గొన్న ఏడుగురు ముస్లిమ్ కౌన్సిలర్లు తాము వందేమాతరం పాడమని చెప్పారు. దాంతో వార్ని సభ నుంచి బయటకి పంపేశారు. మర్నాడు వార్ని ఏకంగా పదవుల్లోంచే తొలగించారు. ఇదంతా కేవలం ఆ ముస్లిమ్ కౌన్సిలర్లు వందేమాతరం పాడమని చెప్పినందుకే! కాని, మన దేశ రాజ్యాంగం ప్రకారం వందేమాతరం పాడాల్సిందేనా?

 

వందేమాతరం తప్పకుండా పాడాలని చట్టాల్లో ఎక్కడా లేదు. రాజ్యాంగం జాతీయ గీతానికి ఇచ్చినట్టుగా వందేమాతరానికి గౌరవం ఇవ్వాలని కూడా చెప్పలేదు. కాని, చాలా హిందూ సంస్థలు వందేమాతరానికి తగిన న్యాయం జరగలేదని భావిస్తుంటాయి. బీజేపి నాయకులు కూడా చాలా వరకూ వందేమాతరానికి తగిన గుర్తింపు రాలేదనే వాదిస్తుంటారు! నిజంగా కూడా రాజ్యాంగ రచన సమయంలో జాతీయ గీతంగా అవతరించేందుకు వందేమాతరమే జనగణమన కన్నా ఎక్కువ అర్హత , అవకాశం కలిగి వుండింది. బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో వందేమాతరం రగులుకొల్పిన ప్రేరణ అంతా ఇంతా కాదు. కాని, ఎప్పటికప్పుడు ముస్లిమ్ లీగ్ లాంటి పార్టీలు, ఇతర ముస్లిమ్ శక్తులు వందేమాతరానికి అడ్డు తగులుతూ వచ్చారు. అందులో దేశాన్ని తల్లిగా పోల్చటమే వారికి వున్న పెద్ద అభ్యంతరం. ఇస్లామ్ ప్రకారం అల్లాకి తప్ప మరెవ్వరికీ మొక్కరాదని నియమం!

 

మతం బోధించిన సంగతి ఎలా వున్నా భారతీయ ముస్లిమ్ నేతలు సామాన్య ముస్లిమ్ లని వందేమాతరం విషయంలో మెప్పించి, ఒప్పించాల్సింది. మెజార్టీ ప్రజలు వందేమాతరం జాతీయ గీతంగా కోరుకున్నప్పుడు దాన్ని మైనార్టీలు కూడా అంగీకరిస్తే బావుంటుంది. కాని, అలా జరగలేదు. కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా ముస్లిమ్ లని వందేమాతరం పాడేలా సరైన పద్దతిలో అంగీకరిపంజేయలేకపోయాయి. ఫలితంగా అదోక పెద్ద వివాదంగా మారిపోయింది.

 

హిందూ సంస్థలు, హిందూత్వ వినిపించే నాయకులు కూడా వందేమాతరం అందరూ పాడాల్సిందేనని ఒత్తిడి చేయటం అంత మంచిది కాదు. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ. అలాంటప్పుడు రాజ్యాంగం తప్పనిసరి చేయని ఒక గీతాన్ని ఆలపించాల్సిందేనని పట్టుబట్టడం సబబు కాదు. లేదంటే, సామరస్య ధోరణిలో వందేమాతరాన్ని వ్యతిరేకిస్తున్న వారితో చర్చలు జరిపి ఒప్పించాలి. చట్టం చేయటం ద్వారా వందేమాతరాన్ని జనగణమనకు సమానంగా వుండేలా చూసుకోవాలి. అంతే తప్ప మున్సిపల్ కార్పోరేషన్లు మొదలు పార్లమెంట్ దాకా ఎక్కడ తమ బలం వుంటే అక్కడ వందేమాతరం బలవంతంగా రుద్దితే… దీర్ఘ కాలంలో అది చెడు ఫలితాలు ఇస్తుంది.

 

ఇప్పుడు మీరట్ మున్సిపల్ కార్పోరేషన్ నుంచి తొలగించబడ్డ కౌన్సిలర్లు కోర్టులో న్యాయపోరాటానికి దిగితే…. మరో సారి వందేమాతరం వార్తల్లోకి వచ్చే అవశాశం వుంది. అలాగే కోర్టు తీర్పు వందేమాతరం ఆలపన విషయంలో స్పష్టత కూడా ఇవ్వొచ్చు!