అసలు ఆరోజు ఏం జరిగింది?.... నిందితులను కాపాడిందెవరు?

ఆయేషా మీరా రేప్‌ అండ్ మర్డర్... పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది కేసు... బెజవాడనైతే ఓ కుదుపు కుదిపింది. ఆయేషా మీరాది విజయవాడ... ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖులది, పోలీసులు నిందితులుగా చూపించినవాళ్లదీ విజయవాడే. అందుకే ఆయేషా కేసు ఆనాడు బెజవాడలో పెను సంచలనం సృష్టించింది. కొన్ని నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు నానింది. అసెంబ్లీలోనూ తీవ్ర చర్చ జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు... వైఎస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడారు. అసలు దోషులను కాపాడుతున్నారని, ప్రముఖులను తప్పించడానికి అమాయకులను ఇరికించారని ఇటు చంద్రబాబు... అటు ప్రజాసంఘాలు పోరాటాలు చేశారు, చివరికి ఆయేషా మీరా తల్లిదండ్రులు సైతం ఇదే మాట చెప్పారు. ఇంతకీ ఆయేషా హత్య జరిగిన రోజు ఏం జరిగింది?

 

విజయవాడ ఇబ్రహీంపట్నంలో బీ-ఫార్మసీ చదువుతుండే ఆయేషా మీరా... కాలేజీకి సమీపంలోని దుర్గా హాస్టల్లో ఉండేది. అయితే క్రిస్మస్ సెలవుల తర్వాత హాస్టల్‌కి వచ్చిన ఆయేషా 2007 డిసెంబర్ 27న దారుణ హత్యకు గురైంది. హాస్టల్ బాత్ రూమ్‌లో నగ్నంగా రక్తపు మడుగులో ఉన్న ఆయేషాను గుర్తించిన సహా విద్యార్ధినులు... హాస్టల్‌ ఓనర్లకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్‌లో ఆయేషా సీన్‌ ఆఫ్‌ మర్డర్‌ చూసి పోలీసులు సైతం హడలిపోయారు. ఆయేషాపై అత్యాచారం చేసిన దుండగులు... అతి క్రూరంగా మర్డర్‌ చేశారు. ఆయేషా డెడ్‌బాడీ పక్కనే ఓ లేఖ కూడా దొరికింది. తన ప్రేమను తిరస్కరించినందుకే ఆయేషాను అత్యాచారం చేసి చంపేసినట్లు నిందితుడు లేఖలో తెలిపాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన విజయవాడ పోలీసులు...కొన్ని నెలలపాటు ఆ హత్యకు అసలు కారణాలను, నిందితులను పట్టుకోలేకపోయారు.

 

ముందుగా హాస్టల్ పరిసరాల్లో ఉండేవాళ్లు, లేదా హతురాలికి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని భావించారు. హాస్టల్‌ ఓనర్‌ భర్తను కూడా అనుమానించారు... కానీ అందుకు తగిన ఆధారాలు పోలీసులకు దొరకలేదు. అయితే పోలీసులపై అనేక ఆరోపణలు వచ్చాయి.  అసలు నిందితులు ఎవరో తెలిసినప్పటికీ ఆనాటి వైఎస్‌ ప్రభుత్వం ఒత్తిడి మేరకు, ప్రముఖుల పిల్లలను తప్పించేందుకు ప్రయత్నించారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయేషా ఘటనలో దాదాపు పది మంది కేసులు పెట్టారు. అందులో 8 తప్పుడు కేసులని అప్పుడే తేలింది. ముందుగా క్రిమినల్‌ గురివిందర్‌‌సింగ్‌ అలియాస్‌ లడ్డూని ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ తర్వాత అతడ్ని వదిలేసి, చివరికి సత్యంబాబుని ఈ కేసులో ఇరికించారు. దాంతో పోలసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయేషా తల్లిదండ్రులు కూడా సత్యంబాబుకి అసలు సంబంధమే లేదని, అన్యాయంగా ఇరికించారని నెత్తినోరు మొత్తుకున్నారు. అయినా అటు ప్రభుత్వం....ఇటు పోలీసులు తాము అనుకున్నదే చేసుకుంటూ పోయారు. ఆయేషా వ్యవహరంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు నిందితులను కాపాడేందుకు కేసును తారుమారుచేశారనే ఆరోపణలను వైఎస్‌ ఎదుర్కొన్నారు.

 

ముఖ్యంగా ఆయేషా రేప్‌ అండ్ మర్డర్‌లో రాజకీయ కోణం ఉందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ వచ్చారు. అప్పటి రాష్ట్ర మంత్రి కోనేరు రంగారావు బంధువుల హస్తముందని... ఆయేషా పేరెంట్స్‌ ఆరోపించారు. ముఖ్యంగా కోనేరు రంగారావు మనవడికి ఈ హత్యతో సంబంధం ఉందని ఎన్నో ఆరోపణలొచ్చాయ్, అయితే ఆ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. కోనేరు కుటుంబానికి అస్సలు సంబంధమే లేదని తేల్చేశారు. ఆ తర్వాత చిల్లర నేరగాడుని అరెస్టు చేసినా... అతగాడినీ నిర్దోషి అంటూ వదిలేశారు. ఆ తర్వాతే కథ కీలక మలుపు తిరిగింది. కొందరు పొలిటీషియన్ల ఒత్తిడితో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబును తెరపైకి తెచ్చారు. సత్యంబాబే ప్రధాన నిందితుడు అంటూ పోలీసులు అరెస్టు చేశారు. చిత్రహింసలు పెట్టారు, దాంతో సత్యంబాబు నడవలేని స్థితికి చేరుకున్నాడు. అయితే సత్యం బాబు నిర్దోషంటూ స్వయంగా హతురాలి కుటుంబ సభ్యులే గొంతు చించుకున్నా.... ఆనాటి వైఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాదు ఆయేషా కేసును కొలిక్కి తేబోయిన పోలీస్‌ అధికారులపైనా బదిలీ వేటేశారు. దాంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

 

ఆయేషా తల్లిదండ్రులు నెత్తీనోరూ మొత్తుకుని కోనేరు రంగారావు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా, ఆనాటి వైఎస్‌ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించలేదు, ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఈ కేసును పెద్దగా పట్టించుకోలేదు. న్యాయం చేయాలంటూ ఆయేషా తల్లిదండ్రులు... కాళ్లరిగేలా ప్రభుత్వాలు చుట్టూ తిరిగినా అప్పటి ప్రభుత్వాలు కనికరించలేదు. అప్పటినుంచి ఈరోజు వరకూ ఆయేషా కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ప్రభుత్వాలు తలుచుకుంటే, దోషులను పట్టుకోవడం కష్టమేమీ కాదు, అంతేకాదు ఆనాడు ఆయేషా కుటుంబం తరపున పోరాడిన చంద్రబాబు.... ఈరోజు అధికారంలో ఉన్నారు కనుక... కేసును తిరగదోడితే... అసలు దోషులెవరో తేలడం పెద్దకష్టమేమీ కాదు.