శభాష్ చంద్రబాబు! నాగం జనార్ధన్ రెడ్డి

 

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి, తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో తెరాసలో చేరుదామని కలలు కంటూ పార్టీని వీడారు. కేసీఆర్ మెప్పు పొందేందుకు చంద్రబాబుపై నిత్యం చాలా ఘాటు విమర్శలు కూడా చేసేవారు. కానీ కేసీఆర్ ఆయనను తెరాసలో చేర్చుకోలేదు సరికదా తెలంగాణా జేఏసీలో కూడా చేరనీయకుండా అడ్డుపడ్డారు. అప్పటి నుండి ఆయన కేసీఆర్ పై కూడా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన కేసీఆర్ ని విమర్శించేందుకు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను మెచ్చుకోవడం విశేషం.

 

చంద్రబాబు పక్క రాష్ట్రాల నుండి అదనపు విద్యుత్ కొనుగోలు చేసి, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తే, కేసీఆర్ మాత్రం మరో మూడేళ్ళ వరకు తెలంగాణా కు విద్యుత్ కష్టాలు తప్పవని గొప్పగా చెప్పుకొంటున్నారని నాగం జనార్ధన్ రెడ్డి ఎద్దేవా చేసారు. నాగం మాటలలో నిజం ఉన్నప్పటికీ ఆయన కేవలం కేసీఆర్ ను విమర్శించేందుకే తను ఇంతకాలంగా ద్వేషిస్తున్న చంద్రబాబును మెచ్చుకొంటున్నట్లుంది తప్ప నిజంగా చంద్రబాబును మెచ్చుకోవడం ఆయన ఉద్దేశ్యం కాదనిపిస్తోంది. చంద్రబాబు లాగే కేసీఆర్ కూడా ఇదివరకు పొరుగునున్న కర్నాటక రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసారు. నాగం జనార్ధన్ రెడ్డి ఆ ఆవిషయం ప్రస్తావించకపోవడం గమనిస్తే, ఆయన పొగడ్తల వెనుక అసలు ఉద్దేశ్యం అర్ధమవుతుంది.