ఫీజు రీయింబర్స్ మెంట్ పై చంద్రబాబు కొత్త ప్రతిపాదన

 

హైదరాబాదు మరియు పరిసర జిల్లాలలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న ఆంద్ర విద్యార్ధులకు 52:48 నిష్పత్తిలో ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను, తెలంగాణా ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించింది. మా పిల్లలకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేసుకొంటున్నప్పుడు, మీరెందుకు మీ పిల్లలకు కేవలం 52 శాతమే చెల్లించాలనుకొంటున్నారు? అని ఎదురు ప్రశ్న వేసారు. విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని తాను మరోకమేట్టు దిగివచ్చెందుకు కూడా సిద్దమని చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై కనీసం చర్చకు కూడా ఆసక్తి చూపలేదు. కానీ, ఫీజు రీయింబర్స్ మెంట్ సాకు చూపి ఇంజనీరింగ్ అడ్మిషన్లు చెప్పట్టకుండా కాలక్షేపం చేస్తే ఊరుకోనని సుప్రీం కోర్టు తీవ్రంగా హెచ్చరించిన తరువాతనే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా ప్రవేశాల ప్రక్రియ చెప్పట్టేందుకు అంగీకరించింది.


చంద్రబాబు నాయుడు ఇదివరకు చెప్పినట్లే, మరో మెట్టు దిగి విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంట్ పై మరొక కొత్త ప్రతిపాదన చేసారు. తెలంగాణాలో ఉన్న ఆంధ్రా విద్యార్ధులు ఎందరో తెలంగాణా ప్రభుత్వమే తేల్చి చెపితే వారందరికీ తమ ప్రభుత్వం 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు సిద్దంగా ఉందని, ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రకటించారు. 1956కు ముందు నుండి ఉన్నవారి పిల్లలే స్థానికులుగా గుర్తిస్తామని తెలంగాణా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది గనుక, తెలంగాణాలో పుట్టిపెరిగిన ఆంద్ర పిల్లలు అందరికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే భరించవలసి ఉంటుంది. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి ఇది అదనపు భారమే అయినప్పటికీ, చంద్రబాబు నిర్ణయం వేలాది విద్యార్ధులకు వారి తల్లి తండ్రులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.


విద్యార్ధులను స్థానికత ఆధారంగా, ప్రాంతాలవారిగా వేరు చేసి చూడటం తగదని సుప్రీం కోర్టు తెలంగాణా ప్రభుత్వానికి మెత్తగా చివాట్లు పెట్టినప్పటికీ, తన వైఖరిలో ఎటువంటి మార్పు రా(లే)దని నిన్న కేసీఆర్ స్వయంగా స్పష్టం చేసారు. బహుశః అందుకే విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాధ్యతగల ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు ఆంధ్ర విద్యార్ధులందరికి ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు సిద్దపడి ఉండవచ్చును. అందుకు ఆయనను అభినందించవలసిందే.