సీబీఐ VS అవినాష్ రెడ్డి.. మోడీ ప్రతిష్ఠ దిగజారుడు!

కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో  సీబీఐ నిస్సహాయత, చేతకాని తనం ఆ దర్యాప్తు సంస్థ ప్రతిష్టనే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టనూ.. అంతకంటే ఎక్కువగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టనూ, ప్రధాని మోడీ ఇమేజ్ నూ కూడా దారుణంగా దెబ్బతీస్తున్నది.  అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ చేతకాని తనంతో వ్యవహరించడానికీ, నిస్సహాయంగా మిగిలిపోవడానికీ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ జగన్ సర్కార్ కు ఇస్తున్న వత్తాసే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు.. ఆ దర్యాప్తు సంస్థపై జనానికి  ఇంత కాలం ఉన్న విశ్వాసాన్ని  దెబ్బతీశాయి.  

కేంద్ర సహకారం లేకపోతే, ఒక ఎంపి ఇంత అరెస్టు చేయడానికి అడుగుముందుకు వేయకుండా ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తుందా అన్న ప్రశ్న సామాన్య జనం నుంచే వస్తున్నది. నిజమే వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో వ్యవహరిస్తున్న తీరు బీజేపీ ఇమేజ్ ను దేశ వ్యాప్తంగా డ్యామేజీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష సిసోడియాను రెండో ఆలోచన లేకుండా అరెస్టు చేయగలిగిన సీబీఐ.. కడప ఎంపీ విషయంలో ఎందుకు మీన మేషాలు లెక్కపెడుతోందన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తడబడుతోంది.

సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోం అంటూ గప్పాలు కొట్టి సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. ఈ విషయంలో బీజేపీ డైలాగులతో ప్రజలను నమ్మించడంలో విఫలమైందనే పరిశీలకులు అంటున్నారు. అవినాష్ కు సీబీఐ అరెస్టుకు మధ్య ఉన్నది కేంద్రంలోని మోడీ సర్కారేనని జనం నమ్ముతున్నారు.  జయలలిత,శిబుసోరేన్, జగన్, గాలి జనార్దన్‌రెడ్డి వంటి  అరెస్టు చేసిన సీబీఐ..  ఒక సాధారణ ఎంపీని అరెస్టు చేసేందుకు, ఒక  జిల్లా ఎస్పీని  బతిమిలాడుకున్న వైనం చూస్తుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కాళ్లూ చేతులూ కట్టేసిందెవరో తెలుసుకోవడానికి పెద్దగా పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. 

కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకారం లేకపోతే, అవినాష్ రెడ్డి ఇప్పటికే అరెస్టై మూడు నెలలు దాటి ఉండేదని పరిశీలకులు అంటున్నారు.  ఏపీలో బీజేపీకి ఎటూ స్టేక్ లేదు. బతిమలాడుకుంటే పొత్తలో భాగంగా  ఒక వేళ ఉంటే గింటే.. ఒకటో రెండో ఎంపీ స్థానాలు, మూడో నాలుగో అసెంబ్లీ స్థానాలూ పోటీకి దక్కే అవకాశం ఉండొచ్చు. వాటిలో కూడా గెలిచే అవకాశాలు అంతంత మాత్రమేనని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఏపీలో జగన్ ప్రభుత్వం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా, బీజేపీ మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu