పాత నోట్లు... 300 ఎవరెస్టులకు సమానం!
posted on Nov 24, 2016 1:49PM

కరెన్సీ నోట్లు అంటే ఇప్పుడు దేశంలో అందరూ పాతవా? కొత్తవా? అని అడుగుతున్నారు! కొత్తవేమో తక్కువున్నాయని టెన్షన్. పాతవేమో ఎక్కడ మన దగ్గరే వుండిపోయి పనికి రాకుండాపోతాయోనని భయం! ఇదీ పరిస్థితి....
కొత్త నోట్లు దొరకటం లేదనీ అందరూ ఆలోచిస్తున్నారుగాని పాత నోట్లు ఏం చేయాలా అని ఆర్బీఐ బుర్ర బద్ధలు కొట్టుకుంటోందట! ఎందుకంటే, అంత భారీగా పాత నోట్లు పోగవుతున్నాయి దేశ ప్రధాన బ్యాంకు వద్ద. ఇంకా డిసెంబర్ 30దాకా పాత నోట్లు మార్చుకోటానికి, డిపాజిట్ కి టైం వుండటంతో 500, 1000 నోట్లు సునామీల వచ్చేస్తున్నాయట. ఇలా మొత్తం దేశంలోని పాత నోట్లు అన్నీ రిజర్వ్ బ్యాంకు వద్దకి చేరితే... వాటి పరిమాణం ఎంత వుంటుందో తెలుసా?
ఓల్డ్ నోట్స్ అన్నీ ఒక దాని మీద ఒకటి పెడితే ఎవరెస్ట్ పర్వతాన్ని 300 రెట్లు మించిపోతాయట! లెంగ్తే కాదు విడ్త్ కూడా అంతే దిమ్మ తిరిగిపోయేలా వుంది. పాత నోట్లు ఒక దాని పక్కన ఒకటి పేర్చుకుంటూ పోతే భూమికి, చంద్రుడికి మధ్య దూరాన్ని 5సార్లు కొలవొచ్చట! ఇంత భారీగా పాత పచ్చ నోట్లు పోగవనున్నాయి. మరి వాట్ని ఏం చేస్తారు?
మొత్తం ప్రపంచ కరెన్సీలో మన నోట్ల శాతం 1.5. అయితే, చైనా ముద్రించే నోట్లు పక్కన పెడితే ప్రపంచంలో మనవే 75శాతం నోట్లు మనవేనట. అంతగా ముద్రించిన అత్యంత ఖరీదైన పచ్చ కాగితాలు ఇప్పుడు సమాధి అవ్వనున్నాయి. ఆర్బీఐ వెనక్కు వచ్చేసిన పాత నోట్లని పాతరేసే ఛాన్స్ వుంది. అది కాకపోతే, కాల్చేస్తారు. ఊరికే ధ్వంసం చేయడం వద్దనుకుంటే పెద్ద పెద్ద పరిశ్రమలకి చెల్లని పెద్ద నోట్లు పిడకల్లా తరలిస్తారు! అంటే వాట్ని కాల్చి ఇంధనంలా వాడుకుంటారన్నమాట!
నోట్ల మార్పుతో నల్లధనం ఎంత బయటకొస్తుందో ఇప్పుడో తెలియదుగాని... బూడిద మాత్రం భారీగానే వస్తుంది. ఇది పక్కా!