‘భారత్‌ మాతాకీ జై’ అనుకూలంగా బీజేపీ తీర్మానం

దిల్లీలో జరిగిన రెండురోజుల బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రస్తుతం నడుస్తున్న అనేక వివాదాల గురించి చర్చ జరిగినట్లు సమాచారం. జేఎన్‌యూ ఘటన గురించి మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘రాజకీయపరమైన విమర్శలను సహించగలం కానీ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదని’ ఈ సమావేశంలో హితవు పలికారట. రోహిత్‌ వేముల, జేఎన్‌యూ ఘటనల వల్ల దళితులు బీజేపీకీ వ్యతిరేకులుగా మారుతున్న విషయాన్ని కూడా సమావేశం గ్రహించినట్లుంది.

అందుకే ముంబైలో అంబేద్కర్‌ స్మారకస్థూపాన్ని నిర్మించాలని ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక భారత్‌ మాతాకీ జై నినాదం గురించి నడుస్తున్న తాజా వివాదం గురించి కూడా ఈ కార్యవర్గం చర్చించింది. ఆ నినాదానికి అనుకూలంగా ఏకంగా ఓ తీర్మానాన్నే ఆమోదించింది. ‘రాజ్యాంగం మన దేశాన్ని భారత్‌ అన్న పేరుతో కూడా గుర్తిస్తుందనీ, సదరు నినాదం మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక తారకమంత్రంగా నిలిచిందనీ..... కాబట్టి భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో భారత్‌ మాతాకీ జై అన్న నినాదాన్ని వ్యతిరేకించడం అంటే, రాజ్యాంగాన్ని అవమానించినట్లే’ అని సదరు తీర్మానం పేర్కొంది.