కొందరికి మమ్మల్ని చూస్తే జ్వరం వస్తుంది- మోదీ

అనుకున్నట్లుగా అంబేద్కర్‌ స్మారకోపన్యాసంలో మోదీ తాము దళితవ్యతిరేకులం కాము అని చెప్పేందుకు ప్రయత్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేకిగా రుజువు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అలాంటి ప్రచారంలో ఎలాంటి నిజమూ లేదనీ, తాము దళితులకు, గిరిజనులకు.... రిజర్వేషన్లను కల్పిస్తూనే వచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోనే కాదు, తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల మీద మచ్చ పడలేదని చెప్పుకొచ్చారు.

అంబేద్కర్‌ను కొందరు ఏదో ఒక వర్గానికి చెందినవాడిగానే గుర్తిస్తారనీ, నిజానికి ఆయన విశ్వమానవుడని కీర్తించారు. మహిళలకు సమానహక్కులు కల్పించడంలో నెహ్రూ, అంబేద్కర్‌కు మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఆయన ఆనాటి క్యాబినెట్‌ నుంచి వైదొలిగారని చరిత్రను గుర్తుచేశారు. అణిచివేయబడిన వర్గాల కోసం పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఎంతటి స్ఫూర్తిని రగిలిస్తారో, అంబేద్కర్ జీవితం కూడా అంతే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కొనియాడారు. తమని చూస్తేనే కొందరికి జ్వరం వస్తుందనీ, జ్వరం వచ్చినవారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారనీ... పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు.