విదేశీయుడే కాని...

Publish Date:Nov 23, 2013

Advertisement

ఒకరికి సహాయ పడాలనే తపన ఉండాలే కాని భాష, వాతావరణం, దేశం వంటివి అడ్డుకానే కావని నిరూపించాడు మ్యాథ్యూపార్డియర్‌. కెనాడా దేశంలో మంచి ఉద్యోగం, కుటుంబం ఇలా జీవితం ఓ క్రమంలో జరిగిపోతున్న సమయంలో ఓసారి మన భారతదేశం రావటం జరిగింది ఇతను. భారతీయ సంస్కృతికి అద్దం పట్టే పలు ప్రాంతాలు చూశాడు. ఇక్కడ సాంస్కృతిక జీవనశైలి ఆయన్ని ఆకట్టుకుంది. తిరిగి కెనడా వెళ్ళిపోయినా ఏదో అసంతృప్తి. దానిని పోగొట్టుకోవటానికి తిరిగి భారతదేశం వచ్చాడు. అతని రాక ఓ ప్రాంతం ప్రజల జీవన స్థాయినే మార్చేసింది.


                

  రె౦డోసారి భారతదేశం వచ్చినప్పుడుకర్ణాటకలోని ధ్వార్వాడ జిల్లాలో ఉన్న కలికేరిలో నివాసం ఏర్పరచుకున్నాడు మ్యాథ్యూ. కర్ణాటక సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టి తబలా నుంచి సితార్‌ దాకా ఒక్కో వాద్యంపైనా పట్టు సాధించాడు. ఆ తర్వాత కలికేరిలో ఓ విద్యాలయం ఏర్పాటు చేసాడు. ఆ విద్యాలయమే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనుల పాలిట వరమయ్యింది. ఈ విద్యాలయంలో చిన్నారులకు ఉచితంగా చదువు చెప్పటమే కాకుండా వివిధ సంగీత వాయిద్యాలపై శిక్షణ కూడా ఇస్తారు. తన విద్యాలయానికి వచ్చే పిల్లల పూర్తి బాధ్యత తనే స్వీకరిస్తాడు. ఏ అవసరానికైనా అండగా నిలుస్తాడు. ఓవిధంగా ఆ పిల్లలందరిని దత్తత తీసుకున్నట్టే`అని చెప్పచ్చు. ఇతని ఈ కృషిలో అతని భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు సహాయపడుతున్నారు. అంతే కాదు కెనాడా నుంచి ఇతని స్నేహితులు ఇరవై మంది చొప్పున మూడు నెలలకో బ్యాచ్‌గా కలికేరికి వస్తారు. ఇక్కడ పిల్లలకి ఇంగ్లీషు వంటివి నేర్పిస్తారు.

        

కలికేరిలో పిల్లల బాధ్యత స్వీకరించిన మ్యాథ్యూ వారికోసం నెలకి సుమారు లక్షన్నార రూపాయాల దాకా ఖర్చుపెట్టాల్సి రావటంతో, ఆ డబ్బును సమకూర్చుకోవటానికి విదేశాలలో సంగీత కచేరీలు చేస్తుంటాడు. అలాగే కలికేరి చిన్నారులతో వివిధ ప్రాంతాలలో సంగీత కచేరీలు నిర్వహిస్తుంటాడు. ఒకో మొట్టు ఎదుగుతూ ఇప్పుడు అక్కడి పిల్లలు చిన్నగా నైనా పెద్దమార్పునే తెస్తున్నారు. ఇక్కడి పిల్లల్లో ఎంతో ప్రతిభ దాగుంది. వీరికి చిన్నచేతి  సాయం అందిస్తే చాలు ` నేను చేస్తున్నది అదే అనే మ్యాథ్యూ ఇప్పుడు కలికేరీ వాసులకు ఓ పెద్ద అండ అని చెప్పచ్చు.

              

దేశంకాని దేశంలో ప్రజల స్థితిగతులని పెంచేందుకు ప్రయత్నిస్తూ తనది కాని ప్రాంతం, భాష, ప్రదేశంలో తన సమయాన్ని, డబ్బుని వెచ్చిస్తున్న మ్యాథ్యూ నిజంగా అభినందనీయుడు ` అందుకే ఈరోజు అతనిని మీకు పరిచయం చేసాను.

....రమ

By
en-us Political News