పెళ్లి సందడి కోసం... ఎంత అప్పుకైనా సిద్ధం

టాటా కేపిటల్, ఖాతాదారులకు రుణాలను అందించే సంస్థ. చదువులు, ఇల్లు కట్టుకోవడం వంటి అవసరాలతో పాటుగా పెళ్లి కూడా జేబులని గుల్లచేసే సందర్భమే అని ఈ సంస్థ గ్రహించింది. మన దేశంలో పెళ్లి ఖర్చుల పేరుతో దాదాపు 700 కోట్ల రూపాయల వరకూ వ్యాపారం జరుగుతోందట. ఇక అనధికారికంగా సాగే ఖర్చులు, కట్నాల గురించి చెప్పేదేముంది. అందుకే పెళ్లిళ్లకి కూడా అప్పులు ఇస్తాం అంటూ టాటా కేపిటల్‌, బజాజ్ ఫిన్‌సర్వ వంటి సంస్థలు ముందుకువస్తున్నాయి. పెళ్లి కోసం 25 లక్షల వరకూ అప్పులు ఇస్తున్నాయి.

 


ఈ నేపథ్యంలోనే టాటా కేపిటల్‌ సంస్థ పెళ్లి ఖర్చుల గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 2,500 మంది పాల్గొన్న ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

 


- నూటికి 74 శాతం మంది పెళ్లి ఖర్చుల బడ్జట్ పది లక్షల వరకూ పెట్టవచ్చన్న అంచనాలో ఉన్నారు. 
- 27 శాతం మంది పెళ్లి కోసం అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టామన్న పశ్చాత్తాపంలో ఉన్నారు.
- ఒకప్పుడు పెళ్లంటే బంధువులకి మర్యాదలు చేయడం, బాజాభజంత్రీలు, హనీమూన్‌కి వెళ్లడం వంటి ఖర్చులకే అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. కానీ ఇప్పటి తరంలో దాదాపు 66 శాతం మంది వివాహ దుస్తులు, ఆభరణాలు, మేకప్‌ వంటి ఆడంబరాలకే అధిక ప్రాధాన్యత అని చెప్పేశారు.
- టాటా కేపిటల్‌వారి గుండెల అదిరిపోయేలా 44 శాతం మంది అసలు పెళ్లిళ్లకి అప్పులు ఇస్తారన్న విషయమే తమకు తెలియదని చెప్పారు. అయితే పెళ్లి ఖర్చుల కోసం ఒకవేళ రుణం దొరుకుతుంటే... దానిని అందిపుచ్చుకునేందుకు 58 శాతం మంది సిద్ధంగా ఉన్నారు.
- 30 ఏళ్లలోపు వారు ఆర్భాటంగా పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. 30 ఏళ్లు పైబడినవారు మాత్రం ఏదో నామమాత్రంగా పెళ్లిసాగిపోతే చాలు అనుకుంటున్నారట.
- 50 శాతం మంది మగవారు ఓ ఐదు లక్షల రూపాయలలోపు ఖర్చుతో పెళ్లి ముగించేయాలని అనుకుంటున్నారు. కానీ ఆడవారిలో 32 శాతం మాత్రమే ఇలా తక్కువ ఖర్చులో పెళ్లి జరిగేందుకు ఇష్టపడుతున్నారు.
- తమ పెళ్లి ధూంధాంగా 30 లక్షల వరకూ ఖర్చుతో సాగాలని ఒ 22 శాతం మంది మగవారు కోరుకుంటున్నారు. ఆడవారిలోనేమో ఆర్భాటంగా పెళ్లి జరగాలని కోరుకునేవారి సంఖ్య 36 శాతంగా ఉంది.
- తీరా పెళ్లి చేసుకుని పద్దులన్నీ చూసుకున్నాక, జరిగిన ఖర్చులని చూసి లబోదిబోమంటున్నారు కుర్రకారు. కనీసం మూడోవంతు మంది యువతులు, తమ పెళ్లి ఖర్చులు అనుకున్నదానికన్నా పదిలక్షలు ఎక్కువగా తేలాయని బాధపడ్డారట.

 

- నిర్జర.