MANGO TOURISM గురించి విన్నారా!


కొన్ని దేశాలలో ద్రాక్ష తోటల్లో పర్యటకులని అనుమతిస్తుంటారు. ఆ తోటల్లో తిరుగుతూ, ద్రాక్షపళ్లతో ఆడుకుంటూ, ద్రాక్ష సారాయిని తయారుచేస్తూ పర్యటకులు సంబరపడిపోతుంటారు. వీళ్ల సరదా ద్రాక్షతోటల యజమానులకి కాసులను కురిపిస్తుంటుంది. మన రైతులకి కూడా ఇలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది కదా! అందుకోసం మన దగ్గర ద్రాక్షతోటలు లేకపోతే ఏం... పళ్లకు రారాజైన మామిడి తోటలు ఉన్నాయి కదా!

 

మేంగో టూరిజం (mango tourism) ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రచారం పొందుతోంది. మహారాష్ట్రలోని రైతులు ఇప్పటికే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా... ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ ఏడాది విస్తృతంగా మేంగో టూరిజంని అందిపుచ్చుకునే ఆశతో ఉన్నాయి. ఇంతకీ ఈ మేంగో టూరిజంలో ఏం చేస్తారంటారా! అబ్బో చెప్పుకోవాలంటే బోలెడు విశేషాలే ఉన్నాయి!

 

- మేంగో టూరిజంలో భాగంగా, విశాలమైన మామిడి తోటలలోకి పర్యటకులను అనుమతిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వమే కొందరు మామిడి రైతులో ఒప్పందం చేసుకొని, వారి తోటల దగ్గరకు యాత్రికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది.

 

- మామిడి తోటల్లోకి ప్రవేశించిన పర్యటకులను రైతులు తమ తోటలన్నీ తిప్పి చూపిస్తారు. మామిడి చెట్లను పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, పూత కాయగా మారేవరకు ఎంత శ్రద్ధగా చూసుకుంటారు, కాయలను ఎలా మగ్గపెడతారు... లాంటి వివరాలన్నింటినీ ఓపికగా చెబుతారు.

 

- పర్యటకులకు కావల్సిన అల్పాహారం, టీ కాఫీలు, భోజనం... అన్నీ కూడా రైతులే ఏర్పాటు చేస్తారు. వాటివల్ల అటు రైతులకీ ఆదాయం కలుగుతుంది, ఇటు యాత్రికులకీ స్వచ్ఛమైన పల్లె ఆహారం తిన్నట్లుంటుంది.

 

- మామిడి తోటల్లో తిరగడమే కాదు... మామిడి కాయలు కోసుకోవడానికి కూడా పర్యటకులకు స్వేచ్ఛ ఉంటుంది. అందుకోసం ఎలాంటి మామిడిపళ్లను ఎంచుకోవాలో రైతులు సలహా కూడా ఇస్తారు. కాకపోతే ఇలా కోసుకున్న పండ్లని చివరికి తూకం వేసి, వాటికి సరిపడా ధరని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పర్యటకులకు తాజా పళ్లు, రైతులకి తగిన గిట్టుబాటు ధరా లభిస్తాయి.

 

- కేవలం పళ్లే కాదు! చాలా తోటల్లో మామిడితాండ్ర, జాం, జ్యూస్, పచ్చళ్లు.. ఇలా మామిడితో చేసిన పదార్థాలన్నీ కూడా దొరికే అవకాశం ఉంటుంది.

 

- తోటల్లో తినడం, తిరగడంతోనే కాలం గడిపేస్తే మజా ఏముంటుంది! అందుకే చాలాచోట్ల ఎడ్లబండి మీద ప్రయాణం, మామిడి పళ్లని తినే పోటీలు పెట్టడం, జానపద నృత్యాలు ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇవేవీ ఇష్టం లేకపోతే హాయిగా నులకమంచం మీద చెట్టు కింద పడుకుని సేదతీరే అవకాశం ఎలాగూ ఉంటుంది.

 

- ఒక్క రోజులో హడావుడిగా గడిపేస్తే ఎలా అనుకునేవారికి... తోటల్లోనే ఒకటి రెండు రోజులు సేదతీరే సదుపాయాలూ కొన్ని చోట్ల ఉన్నాయి.

 

అదీ విషయం! మొత్తానికి ఏదో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ మేంగో టూరిజం ఇప్పుడు రైతులకీ, ప్రభుత్వానికీ కాసులు పండిస్తోంది. అటు కొత్తదనం కోరుకునే పర్యటకులకీ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. అందుకనే ఈ తోటల్లో విహరించేందుకు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తున్నారట. మరి మామిడి పంటకు ప్రసిద్ధమైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి టూరిజం మొదలైతే భలే ఉంటుంది కదా!

- నిర్జర.