రేపటి నుండి మహానాడు

 

తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా నిర్వహించుకొనే మహానాడు సభలు రేపటి నుండి మూడు రోజులపాటు హైదరాబాద్ గండిపేటలో జరగబోతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి మహానాడు సభలకి రెండు రాష్ట్రాల నుండి సుమారు 40 వేల మంది కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు హాజరవుతారని సమాచారం. అందుకు తగ్గట్లుగానే తెదేపా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ 34వ మహానాడు సభలలో తెదేపా చాలా కీలకమయిన నిర్ణయాలు తీసుకోబోతోంది.

 

రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీని నిర్వహించేందుకు వీలుగా పార్టీకి ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. అప్పుడు రెండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించవలసి ఉంటుంది. వీటి కోసం మహానాడులో తీర్మానాలు చేసి కేంద్రకమిటీకి చంద్రబాబు నాయుడుని అధ్యక్షుడిగా ఎన్నుకొన్న తరువాత ఆయన రెండు రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకాలు చేయవచ్చునని సమాచారం. తెలంగాణా తెదేపాకు ప్రస్తుతం యల్. రమణ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆయన స్థానంలో ఎర్రబెల్లి దయాకర్ రావుని కానీ రేవంత్ రెడ్డిని గానీ నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ కు ఈ మహానాడులో పార్టీకి సంబంధించి ఏదయినా కీలకమయిన పదవిని ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పార్టీలో సీనియర్ నేతలలో ఎవరినో ఒకరిని ఆంద్రప్రదేశ్ తెదేపా అధ్యక్షునిగా నియమించే అవకాశం ఉందని సమాచారం.

 

రేపటి నుండి మూడు రోజులపాటు జరిగే సమావేశాలలో బహుశః రెండవ రోజు దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మహానాడు సభలలో ఆంధ్రా, తెలంగాణా సంస్కృతి ఉట్టిపడేలా వేదికను రూపొందిస్తున్నారు. అదే విధంగా ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల వంటకాలను కూడా సభకు విచ్చేసినవారికి రుచి చూపించబోతున్నారు. వేసవి ఎండా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని  ఏసీలను, ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.