మాధవరం ద్రోహమే ఇంతా చేసింది...
posted on Jun 2, 2015 10:40PM

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై కొట్టి తెరాస తీర్థం పుచ్చుకున్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ టీడీపీకి చేసిన ద్రోహమే ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తన నియోజకవర్గంలో వున్న పేదల సంక్షేమం కోసమే పార్టీ మారుతున్నానని, చంద్రబాబు, లోకేష్ తనను క్షమించాలని మాధవరం కృష్ణారావు సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పినప్పటికీ, ఆయన చేసిన ద్రోహం ఆయనకు రాజకీయ బిక్ష పెట్టి, ఎమ్మెల్యేగా అందలం ఎక్కించిన తెలుగుదేశం పార్టీకే ఆయన వెన్నుపోటు పొడిచారని రాజకీయ పరిశీకులకు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆయన పార్టీ మారడం తెలంగాణ తెలుగుదేశాన్ని ఇబ్బందుల్లోకి నట్టింది. అనేక పరిణామాలకు ఆయన పార్టీ మారడం కారణమైంది.
ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో వున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మాధవరం కృష్ణారావు పార్టీ మారడం పెద్ద షాక్ అయింది. ఆయన పార్టీలో వున్నట్టయితే తెలుగుదేశం అభ్యర్థి కూడా విజయం సాధించేవారు. ఆయన పార్టీ మారడంతో తెలుగుదేశం బలం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేయకూడని దుస్సాహసానికి ఒడిగట్టాల్సి వచ్చింది. దాని పరిణామాలు ఆయన ఏసీబీకి దొరికే పరిస్థితి వచ్చింది. పార్టీ మారిన మాధవరం కృష్ణారావు హ్యాపీగా వున్నారు. ఆయన చేసిన పనిని ఇప్పుడు ఎవరూ ప్రశ్నించడం లేదు. పార్టీ కోసం దుస్సాహసం చేసిన రేవంత్ రెడ్డే మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది.