వ్యక్తుల ఇమేజ్ కాదు.. రాజముద్రకే ఇంపార్టెన్స్
posted on Jul 30, 2024 12:41PM
ఏపీ ప్రభుత్వం పథకాలకు పేర్లు మార్చింది. ఒక లక్ష్యంతో వ్యక్తుల ఇమేజ్ కాకుండా, మహానుభావుల పేర్ల మీదుగా పథకాలు ఉండాలన్న సదుద్దేశంతో ఈ మార్పు చేసింది. గత ప్రభుత్వం అన్ని పథకాలకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ పేర్లు పెట్టింది. పేర్ల మార్పు యోచనలో లోకేష్ ఉన్నట్లు తెలియగానే అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహనీయుల పేర్లను ఆయా పథకాలకు పెట్టాలని, సూచించారు.
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆ సూచనను చాలా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. లోకేష్ విద్యా శాఖలో తనదైన ముద్ర వేసుకోవాలని కృషి చేస్తున్నట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయన గత వైసీపీ ప్రభుత్వం తాలూకా గురుతులు అనేవి లేకుండా నిర్వీర్యం చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా అనేక పధకాలకు 'జగనన్న' అని పేరు తగిలించడంతో పాటుగా ఏకంగా ఆయన ఫోటోని వాటికి తగిలించింది. జగన్ పేరు మారుమోగాలనే తపనతోనే వారు ఇలా చేశారన్నదాంటో ఎటువంటి సందేహం లేదు.
అయితే జగన్ పేరు, ఫొటో పిచ్చి గీత దాటిపోయి రోత పుట్టేస్థాయికి చేరిందని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నే టీడీపీ కూటమి సర్కార్ జగన్ పేర్లను, ఫోటోలను తొలగించి వాటి స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ రాజ ముద్రని వేస్తున్నది. తెలుగుదేశం కూటమి సర్కార్ కూడా వైసీపీ లాగా అలోచించి పథకాలకు పేర్లు పెట్టి ఉంటే రెంటికీ తేడా లేదన్న విమర్శలు వచ్చేవి. కానీ లోకేష్ అలా చేయలేదు.. ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం లోగోని ఎంచుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి.
మరోవైపు.. ఆయన తన శాఖలో అరడజను పైగా ఉన్న పథకాలకు జగన్ పేర్లని తొలగిస్తూ లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ పేరు తొలగించి ఆయా పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి. జగనన్న అమ్మ ఒడి పధకం పేరుని తల్లికి వందనం అని, జగనన్న విద్యా కానుక పధకానికి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్ధి మిత్ర అని, జగనన్న గోరుముద్ద పధకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని, మన బడి నాడు మన బడి నేడు అన్న పధకానికి మన భవిష్యత్తుగానూ, స్వేచ్చ అన్న దానికి బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు అన్న పధకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేర్లు మార్చారు. ఈ మార్పు పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.