ఆళ్ళగడ్డ రూటే సపరేటు, పదేళ్లలో పది ఎన్నికలు
posted on Mar 14, 2012 9:52AM
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతంలో తరచూ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. 1989-99 మధ్య ఆళ్ళగడ్డ ఓటర్లు 5 సార్లు ఎంపి ఎన్నికలు, 5 సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1991 లో నంద్యాల పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో ప్రతాపరెడ్డి గెలిచారు. ఇది జరిగిన కొద్దిరోజులకే పివి నరసింహారావు కోసం ఆయన రాజీనామా చేశారు. 1995 లో పార్లమెంట్ కు జరిగిన సాధారణ ఎన్నికల్లో నంద్యాల నుంచి ప్రధాని పివి నరసింహారావు పోటీ చేసి తక్కువ మెజారిటీతో గెలుపొందడంతో రాజీనామా చేశారు. 1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గెలుపొందారు. కేంద్రంలో అనిశ్చితి ఏర్పడటంతో ప్రభుత్వాన్ని రద్దుచేసి 1997 లో ఉప ఎన్నిక నిర్వహించగా రెండోసారి భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. 1990లో మరోసారి కేంద్రంలో అనిశ్చితి ఏర్పడటంతో మళ్ళీ ఎన్నికలోచ్చాయి. ఈ ఎన్నికల్లో కూడా భూమా నాగిరెడ్డి గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే 1989 ఎన్నికల్లో భూమా శేఖరరెడ్డి గెలుపొందారు. అయితే ఆయన హాఠాత్తుగా మరణించడంతో 1992 లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు భూమా నాగిరెడ్డిని ఎన్నుకున్నారు. 1994 లో అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో మరోసారి భూమా నాగిరెడ్డి గెలుపొందారు. 1996లో నంద్యాల ఎంపి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి ఎంపిగా గెలవడంతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో 1997లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించగా శోభా నాగిరెడ్డి గెలిచారు. 1990 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఆమె గెలుపొందారు. ఇలా ఆళ్లగడ్డ ఓటర్లు పదేళ్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని రికార్డును సృష్టించారు.