కన్నీళ్ళపాలైన కొల్లేరు జీవితాలు
posted on Mar 13, 2012 6:11PM
కోల్లేరు... దక్షిణ ప్రాంతంలో ఒకనాడు అది అతిపెద్ద మంచినీటి సరస్సు. రూపాయినాణెం నీటిలో వేస్తే పది అడుగుల లోతులో అదిపడినా స్పష్టంగా కనిపించేది. కొల్లేటి సరస్సు నీరు అంత స్పష్టంగా అంత స్వచ్ఛంగా ఉండేది. పలురకాల మత్స్య సంపద ఇక్కడ పుష్కలంగా ఉండేది ఈ విషయాన్ని విదేశీ పక్షులు కూడా గమనించి ప్రతి సంవత్సరం ఇక్కడకు వలసలు వచ్చి హాయిగా జీవించేవి. కొల్లేటి లంక మత్స్యకారులు కూడా చేపలు వేటాడుతూ సుఖంగా జీవించేవారు. ఇప్పుడు ఈ కొల్లేరు లంక గ్రామాల్లోని మత్స్యకారులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలుపోతున్నారు. 50 సంవత్సరాల ఈ చరిత్రలో కొల్లేరు ప్రాంతం నుంచి మత్స్యకారులు వలసలుపోవడం ఇదే మొదటిసారి. సుమారు 50 ఏళ్ళక్రితం ఒరిస్సా నుంచి వలస వచ్చిన కూలీలు కొల్లేరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఉపాధిలేక వారు మళ్ళీ ఇతరప్రాంతాలకు వలసపోతున్నారు. దీంతో కొన్ని లంకగ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.