TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణాలో వైసీపీకి షాక్.. పార్టీని వీడే ఆలోచనలో ఇద్దరు కీలక నేతలు.!!

Published on: Sat Sep 29, 2018 5:01PM

 

కృష్ణాజిల్లాలో వైసీపీని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు విజయవాడ సెంట్రల్‌ సీటు విషయంలో వంగవీటి రాధాకు మొండిచేయి చూపడంతో.. రాధాతో పాటు ఆయన అనుచరవర్గం వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో రాధా వైసీపీని వీడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంకా ఈ ఎపిసోడ్ కి శుభం కార్డు పడకముందే మరో షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు సీనియర్‌ నాయకులు వైసీపీని వీడనున్నారనే ప్రచారం జరుగుతోంది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో.. ఆయన మరణం తరువాత వైసీపీలో చేరిన సీనియర్‌ నేత కొలుసు పార్థసారధి, జోగి రమేష్‌ లు ఇప్పుడు ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారట. తాము కోరిన సీట్లు ఇవ్వమంటే ఎంత ఇస్తారని వారిని ప్రశ్నిస్తున్నారని.. దాంతో సొమ్ములు ఇచ్చి తాము పోటీ చేయలేమని.. ఆ ఇద్దరు నేతలు వేరే పార్టీకి జంప్‌ కావడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

 


బీసీ సామాజికవర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో పెనమలూరు నుంచి గెలిచిన పార్థసారధికి 2014 ఎన్నికల్లో అక్కడ టిక్కెట్‌ ఇవ్వకుండా మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం నుంచి జగన్‌ పోటీ చేయించడంతో ఆయన అక్కడ ఓటమి చెందారు. దీంతో ఇప్పుడు తనకు మళ్లీ పెనమలూరు సీటు ఇవ్వాలని పార్థసారధి డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల ఆయన జగన్‌ ని కలిసి స్పష్టత కోరగా.. జగన్‌ దూషించారని ప్రచారం జరుగుతోంది. జగన్‌ ఆగ్రహంతో కొన్ని మాటలు అన్నారని.. దాంతో పార్థసారధి కన్నీళ్లు పెట్టుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే అదే సీటుపై పార్థసారధి పట్టుపడుతుండడంతో..అక్కడ ఎంత ఖర్చు పెడతావో చెప్పమని జగన్‌ ఆయనను అడిగారని.. ఆయన ఏదో సంఖ్య చెబితే అది చాలదని ఇంకా కావాలన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీంతో తాను చెప్పిన సొమ్ములు ఖర్చు పెడితేనే సీటు ఇస్తానని జగన్‌ స్పష్టం చేయడంతో ఇక పార్టీలో తాను ఉండలేనని నేడో, రేపో నిర్ణయం తీసుకుంటానని.. ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారట.

 


ఇది ఇలా ఉంటే మరో సీనియర్‌ నేత జోగి రమేష్‌ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 2009లో పెడన నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీ  అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తరువాత వైసీపీలో చేరడంతో.. ఆయనను టిడిపి సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై జగన్‌ పోటీకి నిలిపారు. ఈ ఎన్నికల్లో జోగి ఓటమి చెందినా ఉమకు గట్టిపోటీ ఇచ్చారు. ఇక మళ్లీ అక్కడ నుంచే పోటీ చేయాలని ఆయన భావించి ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆయనకు కూడా జగన్‌ షాక్‌ ఇచ్చారు. ఇక్కడి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌కు సీటు కేటాయిస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. దీంతో కలత చెందిన జోగి తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో స్పష్టత ఇవ్వాలని జగన్‌ ని కోరినట్లు సమాచారం. దీనికి జగన్‌ స్పందిస్తూ సొమ్ములు విషయం ఆరా తీయడంతో ఆయన దిగ్బ్రాంతికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కృష్ణా జిల్లాలో పోటీ చేయాలనే వారిపై అనేక ఒత్తిళ్లు, ఆర్థిక విషయాలు ఎత్తుతుండడంతో ఎవరికి వారు తలో దారి చూసుకుంటున్నారని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.