విభజనపై పునరాలోచించండి : సియం

 

తెలంగాణ ప్రకటన తరువాత రెండోసారి ఢిల్లీ వెల్లిన కిరణ్‌కుమార్‌ రెడ్డి మరోసారి సమైక్యవాదాన్ని బలంగా వినిపించారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయం మీద పునరాలొచించాలని ఆంటోని కమిటీకి స్పష్టం చేశారు. మంగళ వారం రాత్రి ఆంటోని కమిటీని కలిసిన సీమాంద్ర జిల్లాలో జరుగుతున్న ఉద్యమతీవ్రతను కమిటీ ప్రతినిధులకు తెలియజేశారు.

35 రోజులుగా సీమాంద్ర జిల్లాలో లక్షల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారని, ఏ పార్టీ ప్రమేయం లేకుండానే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని ఆయన కమిటీ సభ్యులకు తెలియజేశారు. ప్రస్థుత పరిస్థితులో ప్రజలు నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజల్లోకి వెళ్లాలంటే రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పాడిందని చెప్పారు.

సీమాంద్రలో ఒక్కసీటు కూడ గెలిచే అవకాశం లేదన్న ఆయన ఊరూరా జరుగుతున్న లక్షగళ ఘోష, 175 కిలో మీటర్ల మానవహారం లాంటి అంశాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రవిభజన వల్ల సీమాంద్ర జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుందని అందుకే నిర్ణయంపై కేంద్ర పునరాలోచించాలని కోరారు. ప్రజల మనోభావాలు లెక్కచేయకుండా ముందుకు వెలితే పార్టీ మనుగడే కష్టమవుతుందని కమిటీకి తేల్చిచెప్పారు.