నమో నమామి.. కేసీఆర్ కు మిగిలిన దారిదేనా?

బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిలబడ్డారు. ఒక వైపు ఒక్క ఓటమితో కకావికలుకావడానికి సిద్ధంగా ఉన్న పార్టీని కాపాడుకోవడం, అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పీకలోతు ఇరుక్కున్న కుమార్తె కవితను ఆ కేసు నుంచి బయటపడేయడం. రెండూ ఒకే నిర్ణయంతో జరిగేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణ ఆవిర్బావం నుంచి వరుసగా రెండు దఫాలు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన ఆ అధికార మత్తులో తనకు ఇక తిరుగే లేదన్న భ్రమల్లో పడ్డారు. అందుకే తన పార్టీకి అధికారం కట్టబెట్టిన, తనకు వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించిన తెలంగాణ అన్న సెంటిమెంటును పార్టీకి దూరం చేసేశారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. తెలంగాణ సిద్ధించిన తరువాత ఇక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ కొనసాగాల్సిన అవసరం లేదు.. ఈ తెలంగాణ మోడల్ ప్రగతిని దేశ వ్యాప్తం చేయాలంటే తాను ప్రధాని కావడమేనని ఆయన నమ్మారు. తన మాటను శిలాశాసనంగా భావించే పార్టీ నేతలు, శ్రేణులను నమ్మించారు. అలా నమ్మని వారు ఎవరైనా ఉన్న ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో ఏమో నోరెత్త లేదు.  

పదేళ్ళకు పైగా సాగిన తెలంగాణ ఉద్యమాలలో, ఆ తర్వాత మరో పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను తన కంటి చూపుతో కంట్రోల్ చేసిన కేసీఆర్, దేశ రాజకీయాలను కూడా అలాగే దున్నేయగలనని భావించారు. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు కదిపారు. కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర కూటమి, ధర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ దేశ మంతా చుట్టేశారు. ధనిక రాష్ట్రం అంటూ ఇక్కడి బాధితులను ఆదుకోవడం అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాష్ట్ర సొమ్మును పందేరం చేశారు. అయితే ఆయన మోడీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారాన్ని ఉదృతం చేసి,  కేంద్రంపై విమర్శల తీవ్రత పెంచిన సమయంల అనూహ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం తెరమీదకు వచ్చింది. ఆ కుంభకోణంలో కీలక పాత్ర  కేసీఆర్ తనయ, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ ఆరోపణలు వెల్లువెత్తడం, సీబీఐ, ఈడీల దర్యాప్తు ఆమె అరెస్టు దిశగా సాగడంతో కేసీఆర్ దూకుడుకు బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచీ కేంద్రంపై  ఆయన విమర్శల వరదకు కళ్లెం పడింది. సరిగ్గా ఇదే బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అంటూ కాంగ్రెస్ విమర్శలు వాస్తవమే అన్న నమ్మకం కలిగింది. అదే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి, స్వయంగా కేసీఆర్ పోటీ చేసిన రెండు స్థానాలలో ఒక స్థానం నుంచి పరాజయం పాలు కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి అయ్యింది. 

సరే ఇప్పుడు అధికారం ఎలాగూ దూరమైంది. ఇక ఆయన ముందు ఇప్పడు ఉన్న లక్ష్యాలు పార్టీని, కుమార్తెను కాపాడు కోవడం మాత్రమేనని పరిశీలకులు అంటున్నారు. అందు కోసం ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనేందుకు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ నేతల విమర్శలను అధకార పగ్గాలు  అందుకుని నిండా రెండు నెలలు కూడా కాని కాంగ్రెస్ పైనే సంధిస్తున్నారు తప్ప బీజేపీపై మాత్రం ఆమోదయోగ్యం కాని సంయమనం పాటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ పొలిటికల్ గా మాళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశలు ఉన్నప్పటికీ, ఆయన నమో నరేంద్ర మోడీ) నమామి అంటూ సరెండ్ అవుతారనీ, బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి తన గొంతు విచ్చి మోస్తారని పరిశీలకులు అంటున్నారు. 

కవేళ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే తప్పకుండా అదీ చేసేవారేమో? కానీ అనూహ్యంగా కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవడంతో తెలంగాణ గడప దాటి అడుగు బయట పెట్టలేని స్థితిలో ఉన్నారు. అసలు ఈ ఓటమి కేసీఆర్‌కు చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అపర చాణక్యుడైన కేసీఆర్‌ని ఎదుర్కోవడం ఎవరి వల్లా కాదని, రేవంత్‌ రెడ్డికి నోటి దురద తప్ప మరేమీ చేతకాదని బిఆర్ఎస్ పార్టీలో అందరూ గుడ్డి నమ్మకంతో ఉండేవారు. నిజానికి కేసీఆరే వారందరికీ అటువంటి గుడ్డి నమ్మకం కలిగించారని చెప్పవచ్చు. అందుకే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్‌ ప్రత్యేక విమానాలు వేసుకొని దేశాటన చేస్తున్నప్పటికీ అభ్యంతరం చెప్పలేదు. దేశంలో ఏ పార్టీ కూడా తమతో కలవకపోవడం వలననే కేసీఆర్‌ టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారని తెలిసి ఉన్నప్పటికీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కీలకమైన శాసనసభ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ మహారాష్ట్రలో చక్కర్లు కొడుతున్నప్పటికీ పార్టీలో ఎవరూ తప్పుపట్టలేదు. ఎందుకంటే కేసీఆర్‌పై అంత గుడ్డి నమ్మకం వారికి. ఆయన మంత్ర దండం తిప్పేసి బిఆర్ఎస్‌ని గెలిపించేస్తారని అందరూ గుడ్డిగా నమ్మారు కనుక! కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌ నిర్ణయాలలో చాలా తప్పులే కనిపిస్తున్నాయి వారందరికీ. అందుకే పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్‌గా మార్చుకొనే ఆలోచనలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలలో పోటీ చేసే ఆలోచనలు విరమించుకొని, తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలన్నీ తప్పని బిఆర్ఎస్‌ నేతలు ప్రస్తుతం చాలా మృదువుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ ఎంపీ సీట్లు తగ్గిపోతే వారందరూ మరింత స్పష్టంగా కేసీఆర్‌ తీరుని తప్పు పట్టవచ్చు. అప్పుడు కేసీఆర్‌ని వ్యతిరేకించేవారు లేదా కేసీఆర్‌ వద్దనుకునేవారు కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోవడం ఖాయమే. బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల వలసలు మొదలైతే వాటిని కేసీఆర్‌ కూడా ఆపలేరు. కనుక అవి మొదలవకుండా చేయడంపైనే బిఆర్ఎస్‌ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఓ పక్క కేసీఆర్‌ తలపై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కత్తి వ్రేలాడుతూనే ఉంది. మరోపక్క రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్‌, కేట్, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్‌ నేతలందరి మెడలకు ఉచ్చు బిగించేందుకు అనేక కేసులు సిద్దం చేస్తోంది. ఇదివరకు కేసీఆర్‌ నుంచి రక్షణ కోసం ఈటల రాజేందర్‌ వంటివారు బీజేపీలో చేరితే, ఇప్పుడు ఈ కేసులు, పార్టీని చక్కదిద్దుకోవడం కోసం కేసీఆర్‌ స్వయంగా మోడీ పంచన చేరి బీజేపీ రక్షణ కవచం ధరించక తప్పదు. కేసీఆర్‌కు వేరే దారి లేదు కూడా. బహుశః లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఇదే చేయవచ్చు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu