వదల బొమ్మాలీ వ‌ద‌లా.. ఢిల్లీలోనూ జ‌గ‌న్‌కు దిమ్మ‌తిరిగే షాక్‌లిస్తున్న ష‌ర్మిల

తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కంగారెత్తిపోతున్నార‌ు. ఈ విష‌యం తెలుసుకున్న వైసీపీ నేత‌లు బెంబేలెత్తిపోతున్నారు. ఎవ‌రు అడ్డొచ్చినా కేసులుపెట్టి లోపలేసే మా జ‌గ‌న‌న్న‌కు కంగారెంటి? అంటూ బాధపడిపోతున్నారు. జగన్ కు కంగారెత్తించేంత సీన్  ఎవ‌రికీ లేద‌ంటూ తమకు తామే ధైర్యం చెప్పుకుని  జ‌బ్బ‌లు చ‌చరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి మాత్రం ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి అన్న‌ట్లుగా త‌యారైంది. కేంద్రంలోని బీజేపీ అండ‌దండ‌లు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పుష్క‌లంగా ఉండ‌టంతో ప్ర‌త్య‌ర్థి పార్టీలైన‌ తెలుగుదేశం, జ‌న‌సేన‌లు ఇంత కాలం జ‌గ‌న్ ను దీటుగా ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది పడ్డారు.  కానీ, తాను వ‌దిలిన బాణ‌ం, సొంత సోదరి షర్మిలే  త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును కుప్ప‌కూల్చేందుకు ఎదురు తిరిగి వ‌స్తుండ‌టంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ఈ విషయం ఏపీ రాజ‌కీయాల్లో అవ‌గాహ‌న ఉన్న వారందరికీ ఇప్పటికే అర్థమైపోయింది.  

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ప‌గ్గాలు చేప‌ట్టి  జ‌గ‌న‌న్న‌పై క‌య్యానికి కాలుదువ్వుతున్న ష‌ర్మిల‌ను ఎదుర్కొనేందుకు వైసీపీ నేత‌లు నానా తంటాలు ప‌డుతున్నారు. సూటిగా సుత్తి లేకుండా జ‌గ‌న‌న్నా.. అంటూ ఆమె సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక తమకు మాత్రమే తెలిసిన తిట్ల‌దండ‌కం అందుకుంటున్నారు. తెలంగాణ‌లో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు పునాదులు వేసుకోవ‌టంలో విఫ‌ల‌మైన ష‌ర్మిల కాంగ్రెస్ గూటికి చేరి, త‌న సొంత పార్టీ  వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణ‌లో కోడ‌లినంటూ రాజ‌కీయాలు చేసిన ష‌ర్మిల.. ఇప్పుడు జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇలాకాలో  అస‌లు సిససలైన  వైఎస్ వార‌సురాలిని నేనే అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చరమగీతం పాడేందుకు  కంక‌ణం క‌ట్టుకున్నారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా ఎత్తిచూపుతూ జ‌గ‌న్ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా గ‌ల్లీలోనే కాదు.. ఢిల్లీలోనూ వ‌ద‌లేది లేదంటూ జ‌గ‌న్ లో టెన్ష‌న్ ను మ‌రింత పెంచేస్తున్నారు ష‌ర్మిల‌.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటం చేశారు. అయితే కేంద్రం స్పందించకపోవడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం పాలైంది. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో  నాకు ఇర‌వైకిపైగా ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడ‌లు వంచి ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తానంటూ జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో  ఉదరగొట్టేశారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట‌ల‌ను న‌మ్మిన ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న కోరిన‌ట్లే ఇర‌వైకిపైగా ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించారు. రాష్ట్రంలోనూ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్.. ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని మ‌ర్చిపోవ‌టంతో పాటు.. కేంద్రంతో స్నేహ సంబంధాల‌ను కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ముంచుకొస్తున్న స‌మ‌యంలో ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ర్మిల.. ప్ర‌త్యేక హోదా విష‌యాన్నే ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తూ ప్ర‌జల‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను గుర్తు చేస్తూ వైసీపీ నేత‌ల‌కు వ‌ణుకుపుట్టిస్తున్నారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు వంటి అంశాల‌పై గ‌ళ‌మెత్తుతున్న ష‌ర్మిల‌.. అటూ జ‌గ‌న్, మ‌రోవైపు బీజేపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. ష‌ర్మిల దూకుడుకు చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీ, అమిత్ షాల‌తో పాటు ఇత‌ర కేంద్ర మంత్రుల‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌పై విన్న‌వించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈక్ర‌మంలో బుధ‌వారమే ఢిల్లీ వెళ్లాల్సిన జ‌గ‌న్‌.. మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఆగిపోయారు.  వారి నుంచి ఎప్పుడు అపాయింట్ మెంట్ వ‌స్తే అప్పుడు వెళ్లి క‌లిసేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వై.ఎస్ ష‌ర్మిల ఏకంగా త‌న మ‌కాంను ఢిల్లీకి మార్చేశారు. ష‌ర్మిల ఆధ్వ‌ర్యంలో ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీవెళ్లి అక్క‌డ ధ‌ర్నా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు అంశంతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై ప్ర‌శ్నించేందుకు ఢిల్లీవేదిక‌గా ధ‌ర్నా చేప‌ట్ట‌బోతున్నారు. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 2న‌) ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా చేయ‌నున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ కంటే ముందే మోదీ, అమిత్ షాల‌తో భేటీకోసం షర్మిల ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  వారితో భేటీకి అప్పాయింట్ మెంట్ ల‌భిస్తే.. ప్ర‌త్యేక హోదా, ఏపీకి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్లు కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు.

అయితే, పైకి అలా చెప్పుకుంటున్నా.. మోదీ, అమిత్ షాల‌తో ష‌ర్మిల భేటీ అయితే.. జ‌గ‌న్ రెడ్డికి ఎలాంటి సాయం చేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న కుటుంబాన్ని ఎలా మోసం చేశారో వివ‌రించడమే షర్మిల ఉద్దేశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో సీఎం జ‌గ‌న్ కు బీజేపీ అవ‌స‌రం ఎంతైనా ఉంది. తాజాగా ఎన్నిక‌ల సంఘం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. షెడ్యూల్ ప్ర‌క‌ట‌న త‌రువాత మ‌రింత కఠినంగా ఉండే  అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికితోడు జ‌గ‌న్ స‌ర్వీస్ అధికారుల్ని శంక‌ర‌గిరి మాన్యాలు ప‌ట్టించేందుకు జాబితాను రెడీ చేసుకుంటున్నద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌రోవైపు.. ష‌ర్మిల లేవ‌నెత్తుతున్న ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులు, ఏపీకి రావాల్సిన నిధులు అంశాల‌పై మోదీ, అమిత్ షాల దృష్టికి తీసుకెళ్ల‌డం ద్వారా ష‌ర్మిల వ్యూహాల‌కు జ‌గ‌న్ చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, జ‌గ‌న్ ఢిల్లీ టూర్ స‌మ‌యంలోనే ష‌ర్మిల ఢిల్లీలో తిష్ట‌వేయ‌డం, ఏపీ స‌మ‌స్య‌ల‌పై ఢిల్లీ వీధుల్లో నిర‌స‌నకు పూనుకోవ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందంటున్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను సూటిగా సుత్తిలేకుండా ప్ర‌శ్నిస్తూ తాడేప‌ల్లి పాలెస్ లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి నిద్ర‌లేకుండా చేస్తున్న ష‌ర్మిల‌.. ఇప్పుడు ఢిల్లీలోనూ వ‌ద‌ల  బొమ్మాలీ వదల అంటుండ‌టంతో తాడేప‌ల్లి ప్యాలెస్ లో కంగారు మొదలైందని చెబుతున్నారు.  మొత్తానికి ష‌ర్మిల మాత్రం.. ఏపీలోనే కాదు.. ఢిల్లీలోనూ జగన్ ను వదిలేదే లే.. తగ్గేదేలే అంటూ క‌య్యానికి కాలుదువుతున్నారు. మ‌రి జ‌గ‌న్ ష‌ర్మిల పెట్టే టెన్ష‌న్ నుంచి ఎలా త‌ప్పించుకుంటాడో చూడాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News