ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి.. తమిళనాట 11 జిల్లాలకు అలర్ట్ జారీ
posted on Jul 28, 2025 9:17AM

కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కావేరి నదికి వరద పోటెత్తింది. రాష్ట్రంలో వాగులు, వంకలు, నదులూ అన్ని పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పోతే కావేరీ నదీ ప్రవాహ ఉధృతి పెరిగింది.
కర్నాటకు నుంచి కావేరి నదికి లక్ష 5 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు హోగెనక్కల్ జలపాతాల కు సందర్శకులు వెళ్లకుండా నిషేధించారు. ఇక సేలం లోని మేటూరు డ్యామ్ కు సైతం భారీగా వరద వస్తుండటంతో లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తమిళనాడులోని 11 జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. కావేరి నది పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నది పరిసరాల్లోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు.