తెలంగాణ కమల దళపతికి స్థానిక ఎన్నికలే తొలి పరీక్ష?!

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచంద్ర రావు బాధ్యతలు చేపట్టి అట్టే కాలం కాలేదు. ఈ  నెల మొదటి తేదీన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన, 5న అధికారికంగా   బాధ్యతలు స్వీకరించారు. అంటే.. ఆయన బాధ్యతలు చేపట్టి నిండా నెల రోజులు కూడా కాలేదు.  ఇంతలోనే, ఆయన పనితనాన్ని తూకం వేసి ఒక అభిప్రాయానికి రావడం సరికాదు.అయితే.. కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది అన్నట్లు.. ఈ కొద్ది రోజుల్లోనే ఆయన ఏమిటో అంతో ఇంతో అందరికీ తెలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

నిజానికి రామచంద్ర రావు ఎన్నిక పట్ల, పార్టీ లోపలా, బయటా కూడా చాల పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. బీజేపీ జాతీయ నాయకత్వం మరో మారు తప్పులో కాలేసిందని.. ఇక రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టకట్టలేదన్నవిశ్లేషణలు వినిపించాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి నోరున్న నేతలకు ఇవ్వవలసిన అధ్యక్ష పదవిని బీజేపీ అధిష్టానం నోరులేని రామచంద్రరావుకు ఇచ్చి తప్పు చేసిందనే విమర్శలు,విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఆయనకు సౌమ్యుడు  అనే ముద్ర వేసి..  అదొక పెద్ద అనర్హతగా  పెద్ద ఎత్తున  ప్రచారం జరిగింది. చివరకు.. ఆయన తాను అందరూ అనుకున్నట్లు సౌమ్యుడిని కాదంటూ ఏబీవీపీ నాటి గతాన్ని గుర్తుచేయవలసి వచ్చింది.  

అదలా ఉంటే.. మరోవంక రామచంద్ర రావు ఎన్నిక నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు, అలకలు, లుకలుకలు ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా ఉదంతం, ఆ వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్  మధ్య భగ్గుమన్న విభేదాలు ఆయనకు సవాలుగా నిలిచాయి. అయితే.. రామచంద్ర రావు, అధిష్టానం సూచనల మేరకు, ఆవిషయాలను పార్టీ అధిష్టానానికి వదిలేసి  రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టిని కేద్రీకరించారు. నిజానికి, మరో మూడేళ్ళ వరకు  (అవరోధాలు అన్నీ తొలిగి, జరిగితే) స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప ప్రధాన ఎన్నికలు ఏవీ లేని నేపథ్యంలో, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసమే.. బీజేపీ అధిష్టానం  రామచంద్ర రావుకు పార్టీ పగ్గాలు అప్పగించింది. 

అందుకు తగట్టుగానే రామచంద్ర రావు  రాష్ట్ర కార్యాలయానికి, పరిమితం కాకుండా జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఇతర విషయాలు పక్కన పెట్టి  కార్యకర్తలతో సమావేశ మవుతున్నారు. స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సిద్దం చేస్తూ..  అదే సమయంలో పార్టీని పటిష్టం చేయడం పై దృష్టిని కేంద్రీకరించారు. అలాగే..  జిల్లా మండల స్థాయిలో, ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. అందుకే.. రామచంద్ర రావు ఎన్నిక పట్ల పెదవి విరిచిన విశ్లేషకులే ఇప్పుడు అయనకు  ఫస్ట్ టెస్ట్ లో పాస్  మార్కులు ఇస్తున్నారు. 

అయితే..  ఇల్లు అలకాగానే పండగ రాదు  అన్నట్లుగా ఇక్కడతో అంతా అయిపోయినట్లు కాదని అంటున్నారు. అసలు కథ ముందుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొత్త పాతల మధ్య  అంతర్గత విభేదాలు ప్రస్తుతానికి సర్దుమణిగినా పూర్తిగా సమసి పోలేదని   విశ్లేషకులు అంటున్నారు.  నిజానికి.. బండి సంజయ్, ఈటల రాజేందర్  వంటి సీనియర్ నాయకుల మధ్య విభేదాలను పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. కానీ.. కింది స్థాయిలో విభేదాలు పార్టీకి   ముఖ్యంగా రామచంద్ర రావుకు తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని  విశ్లేషకులు అంటున్నారు.  తాజాగా మహబూబ్‌నగర్‌  జిల్లాలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలే ఇందుకు నిదర్శనంగా పేర్కొం టున్నారు.అయితే..  క్రమశిక్షణ గీత దాటితే ఎంత పెద్ద నేతలపైనైనా చర్యలు తప్పవని, రామచంద్ర రావు హెచ్చరించిన నేపధ్యంలో.. ముందు ముందు ఆయన చర్యలు ఎలా ఉంటాయి అనేది చూడవలసి ఉందని, అంటున్నారు. అలాగే..  ఇతర విషయాలు ఎలా ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికలే ఆయనకు తొలి పరీక్ష కానున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu