కడప విమానశ్రయానికి అన్నమయ్య పేరు

 

 

కడప విమానశ్రయం ప్రారంభించబోతున్నట్లు వార్తలు వెలువడగానే, దానికి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలంటూ వైకాపా డిమాండ్ చేసింది. కానీ దానికి సుప్రసిద్ద వాగ్గేయకారుడు అన్నమయ్య పేరు పెట్టామని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయనున్నట్లు నిన్న విమానశ్రయాన్ని ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కడప విమానశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో బాటు కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే కడప జిల్లా ప్రజల కోరిక నెరవేరిందన్నారు. త్వరలోనే కడప నుంచి చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌లకు కూడా విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపనకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగవచ్చని ఆయన అన్నారు. అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ కడప విమానాశ్రయం నుండి ఏ 320 విమానాలు నడిపేందుకు కూడా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

 

కడప విమానాశ్రయం ఆరంభం అవడం వలన కడప జిల్లా వాసులకు చాలా సౌకర్యం ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వారందరి కంటే ఎక్కువగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లాకు చెందిన వైకాపా నేతలకే ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పవచ్చును. హైదరాబాద్, కడప, బెంగుళూరుల మధ్య తరచుగా తిరిగే జగన్మోహన్ రెడ్డికి ఈ విమాశ్రయం ప్రారంభం కావడం చాలా సౌకర్యం కలిగించిందని భావించవచ్చును. ముఖ్యమంత్రి ప్రారంభించిన కడప విమానాశ్రయం, ఆయనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ద్వేషించే, విమర్శించే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువగా ఉపయోపడటం చాలా విచిత్రమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu