జగన్ ఆరాటమంతా అందుకేనా?

 

ఈరోజు ఉదయం 11 గంటలకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను వెంటబెట్టుకొని వెళ్లి గవర్నర్ నరసింహన్‌న్ని కలవబోతున్నారు. తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినందుకు తెదేపాపై పిర్యాదు చేయడానికి గవర్నర్ ని కలవబోతున్నారు. కానీ ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడు రోజులయింది. ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఆయనకి కోర్టు రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇరువురూ కూడా గవర్నర్ ని కలిసి ఈ వ్యవహారం గురించి మాట్లాడటం అన్నీ జరిగిన తరువాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కి మళ్ళీ కొత్తగా పిర్యాదు చేయడం దేనికంటే బహుశః తెదేపాను అప్రదిష్టపాలు చేసే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే ఆరాటంతోనేనని చెప్పవచ్చును. తెలంగాణాలో జరిగిన ఈ వ్యవహారం గురించి ఆయన అంత ఆసక్తి చూపడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర పోరాటాలు చేసిన వైకాపా నిన్న జరిగిన తెలంగాణా మండలి ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇవ్వడం గమనిస్తే ఆ పార్టీ ద్వంద విధానాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతాయి. ప్రతీ అంశాన్ని తన రాజకీయ లబ్ది కోసమే మలుచుకొనే ప్రయత్నాలు చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఈ అంశాన్ని కూడా అందిపుచ్చుకోవాలనే ఆరాటంతోనే గవర్నర్ ని కలుస్తున్నట్లుంది తప్ప మరే కారణం కనబడటం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu