చంద్రబాబును ఇరికించే దమ్ముందా?
posted on Jun 2, 2015 10:35PM

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును ఇరికించడానికి వైసీపీ నాయకుడు జగన్ చేస్తున్న ప్రయత్నాలు నవ్వురాని కామెడీ ఎపిసోడ్‌ను తలపిస్తున్నాయని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరును కూడా చేర్చాలని జగన్ గవర్నర్ నరసింహన్‌ని కలసి వేడుకోవడం జగన్ రాజకీయ దుర్బుద్ధికి అద్దం పడుతోందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఎలాంటి చిన్న అవకాశం దొరికినా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే జగన్ చేస్తున్న మరో విఫల యత్నమిదని తెలుగుదేశం వర్గాలు విమర్శిస్తున్నాయి.
అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వ్యవహారంలో జగన్ చూపించిన అత్యుత్సాహాన్ని చూసి చిరాకుపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి మద్దతు పలికిన జగన్ పేరు చెబితేనే ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా సంబంధం లేని వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును ఇరికించే ప్రయత్నాలు చేయడం ఏపీ ప్రజలకు జగన్ మీద ఆగ్రహాన్ని పెంచుతోంది. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు పేరును ఇరికించే దమ్ము ఎవరికీ లేదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇందులోకి చంద్రబాబును ఇరికించే ప్రయత్నాలు చేసేవారు వాళ్ళే ఇరుక్కుపోతారని హెచ్చరిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను కోరుకుంటున్న చంద్రబాబును టార్గెట్ చేయడం మంచి పరిణామం కాదని వారు అంటున్నారు.