జగన్ ప్రతిష్ట మసకబారడానికి కారణాలెన్నో

 

ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక సర్వేసంస్థ సీమాంధ్రలో నిర్వహించిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధారణ (పాపులారిటీ) రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడున్న70 శాతం నుండి ఒకేసారి 22శాతానికి పడిపోయినట్లు బయటపెట్టింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఓదార్పుయాత్ర మొదలుపెట్టిన తరువాత ప్రజాధారణ కొంత నిలకడగా ఉన్నట్లు కనబడినప్పటికీ, ఆయన అరెస్టుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు సీబీఐ జేడీ లక్ష్మి నారాయణ జగన్మోహన్ రెడ్డి కేసుల పరిశోధనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో మంచి పేరు సంపాదించుకొనగా, క్రింద కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు అన్ని కోర్టులు బెయిలు తిరస్కరిస్తున్నపుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం పరువు పోగోట్టుకొన్నారు.

 

కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకోగానే, వైకాపా వెంటనే తట్టాబుట్టా సర్దుకొని తెలంగాణాలో బయటపడి సమన్యాయం అనడం, ఆ తరువాత సమైక్యాంధ్ర నినాదం అందుకోవడంతో, మొట్టమొదటిసారిగా ప్రజలకి ఆయన విస్వసనీయతపై అనుమానాలు మొదలయ్యాయి. నాటి నుండే ఆయనను తెలంగాణా ప్రజలు ద్వేషించడం కూడా మొదలుపెట్టారు. తెలంగాణాను వదులుకొని సమైక్య శంఖం పట్టుకొని సీమాంధ్రకు వచ్చిపడినప్పటికీ, సమైక్య ముసుగులో విభజనవాదనే ప్రచారం, కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనకున్న రహస్య సంభందాల గురించి సీనియర్ కాంగ్రెస్ నేతలే చెపుతుండటంతో అయన చేస్తున్న ఉద్యామలపట్ల ప్రజలలో నమ్మకం కలగలేదు. నానాటికీ దిగజారుతున్న పార్టీ పరిస్థితి గురించి వైకాపా సమావేశాలలో విజయమ్మ పదే పదే ప్రస్తావిస్తూ, అందరూ కలిసి పార్టీని బలోపేతం చేయాలని హెచ్చరిస్తునప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి వెలువడటంతో మళ్ళీ ఆయన పాపులారిటీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

 

ఆయన బయటకు వచ్చేసాడు గనుక ఇక పార్టీ దూసుకుపోతుందని అందరూ భావించారు. కానీ, ఆయన ఏపీయన్జీవోలతో వ్యవహరించిన తీరు, తన ఇంటి ముందు టెంట్ వేసుకొని ఆయన చేసిన ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్ష వంటివన్నీ ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చాయి. ఆ తరువాత ఆయన హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించినా, దానివలన ఆయన కానీ, వైకాపాకు గానీ ఎటువంటి మైలేజీ పొందలేకపోయారు. ఆ తరువాత, రాష్ట్ర విభజన ప్రక్రియ జోరుగా సాగుతున్న సమయంలో ఆయన ఉద్యమాలు పక్కనబెట్టి దేశాటన చేసి ప్రతిపక్ష నేతలను కలవడం వలన ప్రజలలో మరిన్ని అనుమానాలు పెరిగాయే తప్ప ఆయన ఆశించినట్లు సమైక్య ఛాంపియన్ గా ఎదగలేకపోయారు.

 

శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చిన నాటి నుండి సమైక్య తీర్మానం కోరుతూ వైకాపా సభ్యులు బిల్లుపై చర్చలో పాల్గొనకుండా తప్పించుకోవడం, అదేసమయంలో ఆయన మళ్ళీ ఏపీయన్జీవో సంఘాల ఎన్నికలలో వేలుపెట్టి భంగ పడటంవంటివి ఆయన ప్రతిష్టను మరింత దిగజార్చాయి. వీటికి తోడు పార్టీలో టికెట్స్ కోసం లుకలుకలు, లక్షలు ఖర్చు బెట్టేసి టికెట్స్ దొరకక బయటకి పోయేవారు జగన్మోహన్ రెడ్డి గురించి చెపుతున్నమాటలు అన్నీకూడా ఆయన ప్రతిష్టను దిగజార్చుతూనే ఉన్నాయి. వెంటనే ఏదోకటి చేయకపోయినట్లయితే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆలోచనతోనే ఆయన చంద్రబాబు నియోజక వర్గం కుప్పం నుండి సమైక్యశంఖారవం చెప్పట్టారు. కానీ దానివలన అతని దుందుడుకు స్వభావమే బయటపడింది తప్ప ఆయనకు, పార్టీకి ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు.

 

ఇప్పుడు తాజాగా మారెప్పపార్టీని వీడుతూ జగన్ గురించి అన్నమాటలు, ఆ వెనువెంటనే పొట్లూరి వరప్రసాద్ పార్టీలో చేరే ఆలోచన విరమించుకోవడం వగైరాలు పార్టీ ప్రతిష్టను మరింత మసకబార్చాయి. అందువలన త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక భారీ సభో, లేక మరో కార్యక్రమమో ప్రకటించవచ్చును.