ఆఘటనపై జగన్ అసెంబ్లీలో ఉంటే..!

 

పాదయాత్ర పేరుతో ఏదో పొడిచేద్దామని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బయలుదేరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలుకు డుమ్మా కొట్టిమరీ పాదయాత్ర ప్లాన్ చేశారు. ఏం చేస్తారు మరి.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి మరి. ఆ రోజులు కవర్ చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొట్టాల్సిందే మరీ. కానీ దీనికి వారు పెట్టుకున్న పేరేమో.. పార్టీ ఫిరాయింపు నేతలపై నిరసన అని. అయితే వాళ్లు చెప్పినంత మాత్రాన నమ్మడానికి అంత అమాయకంగా అయితే ఎవరూ లేరు కదా. ఇక ఏపీ అధికార పక్షం కూడా ప్రతిపక్షం వున్నా ఒకటే.. లేకపోయినా ఒకటే.. అన్నట్టు ప్రశాంతంగా సమావేశాలు జరుపుకుంటూ పోతున్నారు.

 

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అండ్ కో బ్యాచ్ ఇప్పుడు ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. అదేంటంటే.. కృష్ణానది వద్ద పడవ మునిగి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది ఈ టైంలో ప్రతిపక్షం కనుక అసెంబ్లీలో ఉంటే.. అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించి ఇరుకున పెట్టే ఛాన్స్ కోల్పోయింది అంటున్నాయి. గతంలో పుష్కరాలు జరిగినప్పుడు జరిగిన తోపులాట గురించి జగన్ అసెంబ్లీలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు కూడా తాజా ఘటనపై స్పందించి అసెంబ్లీలో రచ్చ చేసే ఛాన్స్ ఉండేది..కానీ జగన్ మిస్ అయ్యాడు అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మాత్రం.. ఆ జగన్ అసెంబ్లీలో ఉన్నా... ఏదో ఓ నాలుగైదు సినిమా డైలాగ్ లు కొట్టేసి, వైసీపీ నేతలు స్పీకర్ ను చుట్టుముట్టేసి, కాగితాలు చించి హడావుడి చేయడం తప్పా మరేమి ఉండేది కాదు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ వల్ల బాధితులకు ఏమైనా ప్రయోజనం చేకూరేదా..? అంటే అదీ లేదు.. అంటున్నారు. ఎందుకంటే గత మూడున్నర్రేళ్ళల్లో జగన్ ఏనాడూ ఆ కార్యాన్ని విజయవంతంగా నిర్వహించలేదు. ఈ మూడేళ్ళల్లో జగన్ కున్న ఫ్లాష్ బ్యాక్ అలాంటిది మరి. అందుకే ఈ ఛాన్స్ పోయింది అని ఫీలవడానికి కూడా ఏం లేదు.. వాళ్లు ఉన్నా ఒకటే.. లేక పోయినా ఒకటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఇంతకీ వైసీపీ నేతల మనసులో ఏముందో మరీ..