అసెంబ్లీలో చంద్రబాబు తెలంగాణ పదం నిషేధించారా? కేసీఆర్ ఆరోపణల్లో వాస్తవం ఉందా?!

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగంలో గతంలోని వాడి, వేడీ కనిపించలేదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పార్టీ నేతలు, శ్రేణులే కేసీఆర్ ప్రసంగం చప్పగా ఉందని పెదవి విరుస్తున్నారు. ఆయన పిలుపు మేరకు నేతలు, క్యాడర్ శ్రమించి సిల్వర్ జూబ్లీ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించారు. అయితే ఆ వచ్చిన వారిని ఆకట్టుకునే విధంగా అయితే కేసీఆర్ ప్రసంగం లేదన్న భావన పార్టీ వర్గాల నుంచే వ్యక్తం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ తన ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను టార్గెట్ చేయడానికీ, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడానికే పరిమితం చేశారు తప్ప.. బీజేపీ గురించి ఒక్కటంటే ఒక్క మాట లేదు. ఒక్క విమర్శ లేదు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్నట్లుగా బీజేపీ ఎదుగుతున్న సూచనలకు కనిపిస్తున్నా కేసీఆర్ మాత్రం ఆ పార్టీపై చిన్నపాటి విమర్శ చేయడానికి కూడా ఇష్టపడలేదన్నట్లుగా ప్రసంగించారని పార్టీ క్యాడర్ నిరుత్సాహంగా చెబుతోంది. అన్నిటికీ మించి అసందర్భంగా చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని  నిషేధించారంటూ వైల్డ్ ఆరోపణ ఒకటి చేసేశారు. చంద్రబాబు ఆదేశంతోనే అప్పటి స్పీకర్ ప్రతిభాభారతి సభలో తెలంగాణ నినాదం వినిపించకూడదంటూ రూలింగ్ పాస్ చేశారని కేసీఆర్ అన్నారు.  

కేసీఆర్ ప్రసంగంలో మునుపటి వాడీవేడీ లేకపోవడం అటుంచి కేసీఆర్ తన ప్రసంగంలో చంద్రబాబు గురించి అసత్యాలు చెప్పారనీ, తద్వారా జనంలో చంద్రబాబును తెలంగాణకు బూచిగా చూపించి, ఆయనకు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ కు ఉన్న అనుబంధం తెలంగాణకు నష్టం చేకూరుస్తుందని చెప్పడానికి నానా ప్రయాసా పడ్డారని పార్టీ వర్గాలే అంటున్నాయి. అప్పడు ఏం జరిగిందో తెలిసిన వారు కేసీఆర్ నోట ఈ అవాస్తవాలు ఏంటి? ఆయన బీజేపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించారా? కుమార్తె  కవిత మద్యం కుంభకోణం కేసు, కుమారుడు కేటీఆర్ పై కేసులు, అదే విధంగా ఫోన్ ట్యాంపరింగ్ కేసుల భయంతో బీజేపీని శరణు జొచ్చుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆప్పుడు, ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి చంద్రబాబు పేరు ఉపయోంచుకుంటున్నారు. అయితే రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ఏనాడు బీఆర్ఎస్ ప్రస్తావన కానీ, కేసీఆర్ ప్రస్తావనను కానీ తీసుకువచ్చిన సందర్భం లేదు.

కానీ కేసీఆర్ కు మాత్రం తన రాజకీయం కోసం చంద్రబాబు పేరు వాడని సందర్భం లేదు. 
ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని చంద్రబాబు నిషేధించారనడం పూర్తిగా అవాస్తవం.  అప్పుడు అసలు జరిగిందేంటంటే.. 2001లో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి టీఆర్ఎస్ ను స్థాపించారు.  అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) అప్పటి వాజ్ పేయి ప్రభుత్వానికి ఒక తీర్మానాన్ని పంపింది. అ  తక్షణమే రెండో ఎస్ఆర్సి ఏర్పాటు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను పరిశీలించాలని అందులో కోరింది. అయితే అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్ కే అద్వానీ అందుకు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.  చిన్న రాష్ట్రాలు ఆచరణ సాధ్యం కాదనీ, చిన్న రాష్ట్రాల వల్ల దేశ సమగ్రతకు ముప్పనీ పేర్కొన్నారు. ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కు అసలు ప్రాతినిథ్యమే లేదు.  

ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులు సభలో జై తెలంగాణ నినాదాలు చేయడం ప్రారంభించారు. వారి వైఖరి కారణంగా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగేది. ఈ నేపథ్యంలోనే అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి సభలో నినాదాలను నిషేధిస్తూ రూలింగ్ ఇచ్చారు. అయితే ఆ రూలింగ్ లో ఎక్కడా తెలంగాణ నినాదాలను నిషేధిస్తున్నట్లు ఎక్కడా లేదు. మొత్తంగా సభా కార్యక్రమాలను అడ్డుకునే విధంగా సభ్యులు నినాదాలు చేయడాన్ని నిషేధిస్తూ అప్పటి స్పీకర్ ప్రతిభా భారతి రూలింగ్ ఇచ్చారు.  తెలంగాణ నినాదాల బహిష్కరణ అనే మాటను కేసీఆర్ తన రాజకీయ అజెండా మేరకు తీసుకువచ్చి చంద్రబాబుకు ఆపాదించారు. అదిగో సరిగ్గా అప్పటి నుంచే టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య స్నేహ బంధం ఏర్పడింది. 2004 అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీలూ కలిసి పని చేయడానికి ఒక అంగీకారానికి వచ్చేలా చేసింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమి విజయం సాధించి వైఎస్ ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.  కేసీఆర్ కేంద్ర మంత్రి పదవి దక్కింది. సో చెప్పొచ్చేదేంటంటే.. నాడు, నేడూ కూడా చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ఫోకస్ చేసి రాజకీయలబ్ధి పొందాలన్నది కేసీఆర్ ప్రయత్నం అప్పడూ.. ఇప్పుడూ కూడా. అందుకే సిల్వర్ జూబ్లీ సభలో కూడా కేసీఆర్ చంద్రబాబు జపమే చేశారు. ఆయనపై విరమ్శలు గుప్పించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ను సజీవంగా ఉంచాలన్నదే ఆయన ప్రయత్నమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.