ప్రోత్సాహం ఉంటే!


చల్లటి చలికాలం. రక్తం కూడా గడ్డకట్టుకుపోయే ఓ మంచు ప్రదేశం. ఆ ప్రదేశం గుండా కొందరు శరణార్ధులు నడుస్తున్నారు. వారందరి మొహాలలో ఉత్సాహం. మరొక్క రెండు కిలోమీటర్లు అలా నడిస్తే చాలు, వాళ్లంతా ఓ కొత్త దేశానికి చేరుకుంటారు. అక్కడ తమ కోసం ఓ కొత్త జీవితం ఎదురుచూస్తోంది. అలా వాళ్లు ఉద్వేగంతో నడుస్తున్నారో లేదో, దారి సన్నబడటం మొదలైంది. ఆ దారిలో ఒక్క అడుగు అటూ ఇటూ వేసినా పక్కనే ఉన్న పాతాళంలోకి జారిపోవడం ఖాయం. అందుకని ఒకరి చేయి ఒకరు పట్టుకుని నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం మొదలుపెట్టారు. కానీ ఎంత జాగ్రత్తగా నడిచనా వారి భయం నిజం కాక తప్పలేదు. గుంపులో ఉన్న ఓ ఇద్దరు హఠాత్తుగా లోయలోకి జారిపోయారు. లోయ మధ్యలో ఉన్న ఓ చిన్న చెట్టుని పట్టుకుని వేళ్లాడటం మొదలుపెట్టారు. వారిద్దరినీ చూడగానే మిగతా గుంపు కంగారుపడిపోయింది. వారిని పైకి లాగుదామంటే దగ్గర్లో ఒక్క తాడు ముక్క కూడా లేదయ్యే!


‘పైకి వచ్చే ప్రయత్నం చేయవద్దు! అలాగే చెట్టుని పట్టుకుని వేళ్లాడుతూ ఉండండి. త్వరలోనే ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం’ అంటూ గుంపులో జనమంతా అరవడం మొదలుపెట్టారు. వాళ్లకి తెలుసు. కింద ఉన్న ఇద్దరూ ఎక్కువసేపు అలా ఉండలేరని! అయినా వాళ్లు పైకి వచ్చే ప్రయత్నం చేస్తే మరింత త్వరగా ప్రాణాలు పోతాయని అనుకున్నారు. అందుకే ఎవరికి వాళ్లు తాడు కోసం వెతుకుతూనే ‘పైకి వచ్చే ప్రయత్నం చేయవద్దు’ అంటూ అరవడం మొదలుపెట్టారు.


నిమిషాలు గడుస్తున్నాయి. కింద చెట్టుని పట్టుకున్న వారిద్దరి వేళ్లూ మొద్దుబారిపోవడం మొదలుపెట్టాయి. ఇంతలో వారిలో ఒకడు నిదానంగా పైకి వచ్చే ప్రయత్నం చేయసాగాడు. రెండో వాడు అలాగే భయంతో చెట్టుని మరింత గట్టిగా పట్టుకుని వేళ్లాడసాగాడు. రెండోవాడిని నిలువరించేందుకు పై నుంచి అరుపులు మరింత తీవ్రం కాసాగాయి. పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే చస్తావంటూ హెచ్చరించడం మొదలుపెట్టారు గుంపులోని గోవిందయ్యలు. అయినా వారి వంక చిరునవ్వులు చిందిస్తూ, ఒకో అడుగే పట్టు చిక్కించుకుంటూ, చేతులని రాతి సందుల్లో ఇరికిస్తూ పైకి రాసాగాడు రెండోవాడు. ఒక్క అరగంట అలా ఒకో అంగుళం పైకి ఎక్కుతూ ఎట్టకేలకు కొండదారిని చేరుకున్నాడు. ఈలోగా కిందనున్న మనిషికి మాత్రం వేళ్లు మొద్దుబారిపోయాయి. పట్టుతప్పి లోయలోకి పడిపోయాడు.


రెండోవాడు విజయోత్సాహంతో పైకి రాగానే, అందరూ అతని చుట్టూ గుమికూడారు. ‘మేమంతా నిన్నంతగా నిరుత్సాహపరుస్తుంటే, నువ్వెందుకు వెనక్కి తగ్గలేదు!’ అంటూ రకరకాల ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలన్నింటికీ అతని చిరునవ్వే సమాధానం అయ్యింది. అతని చిరునవ్వు చూసి గుంపులో జనానికి మరింత పిచ్చెత్తిపోయింది. ఇంతలో ఈ విషయాన్నంతా గమనిస్తున్న ఓ పద్దాయన అతని దగ్గరకి వెళ్లాడు. అతణ్ని నిశితంగా పరిశీలించిన తరువాత చాలాసేపు ఏవేవో సైగలు చేశాడు. చివరికి తన గుంపుతో అన్నాడు కదా ‘ఇతనికి పాపం చెవుడు. అస్సలేమీ వినిపించదు. దాంతో మీరు అతణ్ని నిరుత్సాహపరుస్తూ చెప్పిన మాటలు కూడా అతనికి వినిపించలేదు సరికదా... మీ ఉద్వేగాన్ని చూసి మీరంతా అతణ్ని ప్రోత్సహిస్తున్నారని అనుకున్నాడు. ఆ ఉత్సాహంతోనే పైకి చేరుకున్నాడు’ అని చెప్పుకొచ్చాడు.


ఆ మాటలు విన్న జనాలకి మతిపోయింది. ఎలాగూ తాము తాడు తెచ్చేదాకా వాళ్లు బతకరని గుంపులో జనానికి తెలుసు. కనీసం వారిని పైకి రమ్మని ప్రోత్సహిస్తే బాగుండేది కదా అనిపించింది. రెండోవాడు చెవిటివాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే తమ ప్రవర్తన వల్ల అతని ప్రాణం కూడా పోయి ఉండేది కదా అనిపించింది. నిరుత్సాహాన్ని కలిగించే మాటలు, గెలిచే అవకాశం ఉన్నచోట కూడా పరాజయాన్ని రుచిచూపిస్తాయనీ... ధైర్యాన్ని కలిగించే ప్రోత్సాహం, పరాజయం లోతుల్లోనుంచి మనిషిని గెలిపిస్తాయని తెలిసివచ్చింది. ఆ వివేకం వారికి ముందే ఉండి ఉంటే ఓ నిండుప్రాణం పోయేది కాదు కదా!

- నిర్జర